- సిపిఐ
న్యూఢిల్లీ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశంలోని విద్యార్థులు, యువతకు చారిత్రక విజయమని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ప్రధాన కార్యదర్శి డి రాజా అభివర్ణించారు. ఇది అహంకారపూరిత ప్రభుత్వ దయాదాక్షిణ్యాల వల్ల సాధించినది కాదని, దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత సాగించిన నిరంతర పోరాట ఫలితమేనని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బిజెపి అహంకారాన్ని విద్యార్థి ఉద్యమం ఓడించి, తన వైఫల్యాలకు జవాబుదారీగా ఉండాలని మోడీ-షా ప్రభుత్వాన్ని నిలదీసిందని అన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్‌ను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి, భాష్పవాయువు ప్రయోగించి ప్రభుత్వం అణచివేతకు దిగిందని ఆయన విమర్శించారు. అయినప్పటికీ, విద్యార్థులు, యువత అసాధారణ ధైర్యంతో, భయం లేకుండా నిలబడి పోరాటాన్ని కొనసాగించారని కొనియాడారు. నిరసన తెలిపిన విద్యార్థులు, యువతపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని, శాంతియుత ఆందోళనకారులపై హింసను ప్రయోగించినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యువ ప్రాణాలు కోల్పోయినా ఈ నిర్లిప్త ప్రభుత్వం చలించలేదని, రోడ్లపై నిరంతర నిరసనలే ఈ ఫలితాన్ని రాబట్టాయని అన్నారు. నీట్ పేపర్ లీక్ ఘటన, పరీక్షా వ్యవస్థ తీవ్ర వైఫల్యాల కారణంగా తమ ప్రియమైన పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ధైర్యంగా, సంకల్పంతో నిలబడి పోరాడిన విద్యార్థులు, యువతను రాజా అభినందించారు. ఈ విజయం వారికే చెందుతుందని పేర్కొన్న ఆయన, తమ పోరాటం ఇక్కడితో ఆగదని, అందరికీ అందుబాటులో ఉండే, సమ్మిళితమైన, నాణ్యమైన ప్రభుత్వ విద్య కోసం, భారత యువత ఆకాంక్షలను నెరవేర్చే విద్యా వ్యవస్థ కోసం కొనసాగుతుందని స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)