ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డియుఎస్‌యు ఎన్నికల్లో త్రిముఖ పోరు

8 గంటల క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 12:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎస్‌ఎఫ్‌ఐ-ఎఐఎస్ఎ కూటమితో హోరాహోరీ పోరు

- కూటమి మేనిఫెస్టో విడుదల

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్‌ యూనియన్ (డియుఎస్‌యు) ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్ఎ కూటమిగా పోటీ చేయడంతో త్రిముఖ పోరుకు రంగం సిద్ధమైంది. డబ్బు, ప్రలోభాలతో ఎన్నికల ప్రజాస్వామ్య స్వభావాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న ఎబివిపి, ఎన్‌ఎస్‌యుఐలకు ఎస్‌ఎఫ్‌ఐ-ఎఐఎస్ఎ కూటమి సవాల్‌గా మారింది. ఎస్‌ఎఫ్‌ఐ - ఎఐఎస్ఎ కూటమి శనివారం తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని సత్యనికేతన్‌లో పిజి విద్యార్థులు నివసిస్తున్న భవనం కూలిన ఘటన నేపథ్యంలో వసతి గృహాల కొరతను ప్రధాన ఎన్నికల అంశంగా తీసుకోనున్నట్లు అభ్యర్థులు తెలిపారు. విద్యార్థులందరికీ సురక్షితమైన, అందుబాటులో ఉండే హాస్టల్‌ సౌకర్యం కల్పించాలనే డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

ఈ ఏడాది డియుఎస్‌యు ఎన్నికలు జంతర్‌మంతర్‌ విద్యార్థి-యువజన ఉద్యమం నేపథ్యంలో జరుగుతున్నాయని అభ్యర్థులు పేర్కొన్నారు. ఆ ఉద్యమంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్ఎ చురుకుగా పాల్గొన్నాయని తెలిపారు. ఐషీ ఘోష్‌, నేహా బోరా తదితరులు సోనం వాంగ్‌చుక్‌తో కలిసి నిరాహార దీక్షలో పాల్గొన్నారని గుర్తుచేశారు. విద్యార్థులు ఐక్యంగా పోరాడితే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలమని జంతర్‌మంతర్‌ ఉద్యమం నిరూపించిందన్నారు. డియులో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందని కూటమి అభ్యర్థులు అన్నారు. విద్యార్థుల హాస్టల్‌ వంటి న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఎబివిపి, ఎన్‌ఎస్‌యుఐ చొరవ చూపడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో డబ్బు ఖర్చు చేస్తూ ప్రచారానికి వచ్చే ఈ సంఘాలు, ఎన్నికల అనంతరం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమ‌ర్శించారు. అధ్యక్ష పదవికి ఎఐఎస్ఎ తరపున అనన్య రతురి, కార్యదర్శి పదవికి ఎస్‌ఎఫ్‌ఐ తరపున స్టాంజిన్‌ డెస్క్యోంగ్‌ పోటీ చేస్తున్నారు. ఉపాధ్యక్ష పదవికి ఎఐఎస్ఎ అభ్యర్థి అక్షత్‌ శిఖర్‌, సంయుక్త కార్యదర్శి పదవికి ఎస్‌ఎఫ్‌ఐ అభ్యర్థి బి. పారిజాత్‌ బరిలో ఉన్నారు. అనన్య ఉత్తరాఖండ్‌కు, స్టాంజిన్‌ లడాఖ్‌కు చెందినవారు కాగా, అక్షత్‌, పారిజాత్‌లు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్