- మూడు సబ్జెక్టుల్లో నిర్వహణ
- ఎన్‌టిఎ నిర్ణయం
న్యూఢిల్లీ : లీకులు, అక్రమాలు జరగడంతో యుజిసి నెట్ పరీక్షలను మరోసారి నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఆదివారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. పరీక్ష ప్రశ్నాపత్రాలు, నిర్వహణ లోపాలపై అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ పరీక్షలను తిరిగి నిర్వహించాలని ఎన్‌టిఎ నిర్ణయించిందని ఆ సంస్థకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. వీటిపై సమీక్షించేందుకు ఒక కమిటీని కూడా ఎన్‌టిఎ ఏర్పాటు చేసిందని ఆ అధికారి వెల్లడించారు. ఎన్‌టిఎ అధికార ప్రకటన ప్రకారం యుజిసి -నెట్ పరీక్ష 87 సబ్జెక్టులకు నిర్వహిస్తారు. వీటిలో మూడు సబ్జెక్టులకు పునఃపరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు పరీక్షలను మళ్లీ నిర్వహించనున్నారు. ఇంగ్లీష్ పరీక్షను సెప్టెంబర్ 9న (షిఫ్ట్ 1) ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు, కామర్స్ పరీక్షను సెప్టెంబర్ 9న (షిఫ్ట్ 2) మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, సోషియాలజీ పరీక్షను సెప్టెంబర్ 10న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్నారు.
పరీక్ష ఏ నగరంలో నిర్వహిస్తారో, పరీక్షా కేంద్రం, అడ్మిట్ కార్డుకు సంబంధించిన వివరాలను ఎన్‌టిఎ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ మూడు సబ్జెక్టులకు పరీక్షను తిరిగి నిర్వహించే అభ్యర్థుల నుండి అదనపు పరీక్ష రుసుము వసూలు చేయడం లేదని ఎన్‌టిఎ తెలిపింది. యుజిసి నెట్ నిర్వహించిన మిగిలిన 84 సబ్జెక్టులకు సంబంధించిన తాత్కాలిక జవాబు కీ పిడిఎఫ్‌లను ఎన్‌టిఎ ఆదివారం విడుదల చేసింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జెఆర్‌ఎఫ్) అవార్డు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం యుజిసి నెట్ పరీక్షలను నిర్వహిస్తారనే విషయం తెలిసిందే.







కామెంట్‌లు (0)