- ఎంపి, ఎమ్మెల్యేలకు వినతులు
- ఎస్‌కెఎం పిలుపు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతు సమస్యలపై ఈనెల 17 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా వాహన యాత్రలు నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంపి, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఎస్‌కెఎం ప్రకటన విడుదల చేసింది. ‘‘2020-21 నాటి రైతు ఉద్యమం అనంతరం, ఎస్‌కెఎంకు 2021 డిసెంబర్ 9న ఇచ్చిన లిఖితపూర్వక హామీని మోడీ ప్రభుత్వం అమలు చేయని నేపథ్యంలో, దేశవ్యాప్తంగా రైతులంతా వాహన యాత్రలు నిర్వహించనున్నాం. ఎంపి, ఎమ్మె ల్యేలను కలిసి తమ ఏడు ప్రధాన డిమాండ్లు, అత్యవసర స్థానిక డిమాండ్లపై చర్యలు తీసుకునేలా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రు లపై ఒత్తిడి తేవాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించ నున్నాం. ఈ ప్రజా ఉద్యమంలో నియోజకవర్గంలోని గ్రామాలకు చెందిన రైతు ప్రతినిధులు కూడా పాల్గొంటారు’ అని పేర్కొంది.
ప్రధాన డిమాండ్లు...
అన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయడం, హామీతో కూడిన పంటల సేకరణతోపాటు కనీస మద్దతు ధర (సి2+50 శాతం) కోసం చట్టాన్ని తీసుకురావడం, రుణమాఫీ, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం అందించడం, విద్యుత్ ప్రైవేటీకరణను నిలిపివేయడం, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ రంగంలో పంటలు, పశువులకు పూర్తిస్థాయి బీమా కల్పించడం, నెలకు రూ.10,000 పింఛను ఇవ్వడం, నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయడం, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి. ఈ డిమాండ్లన్నీ నెరవేర్చాలని కోరుతూ నవంబర్ 26 నుండి దేశవ్యాప్తంగా నిరంతర ప్రజా పోరాటాలను తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని అంతం చేయడానికి, వ్యవసాయాన్ని, భారతదేశాన్ని కాపాడటానికి పటిష్టమైన విధాన మార్పులు చేయాలని ఎస్‌కెఎం డిమాండ్ చేసింది. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి, వ్యవసాయ ఆధారిత పారిశ్రామికీకరణను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి, ఉపాధి కల్పనకు, తద్వారా తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, అసమానత, విస్తృతమైన గ్రామీణ రుణభారం, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలసలు, రైతులు, రోజువారీ కూలీల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయడానికి, రాష్ట్రాలకు కేటాయించాల్సిన నిధుల వాటాను (ప్రస్తుతం సెస్సులు, సర్‌చార్జీలతో కలిపి 31 శాతం) 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేసింది. పెరుగుతున్న తీవ్రమైన అసమానతలను అంతం చేయడానికి, శ్రామిక ప్రజలకు వనరుల పంపిణీని నిర్ధారించడానికి, పౌరులందరికీ ఉపాధి, విద్య, ఆరోగ్యం, గృహవసతి, తాగునీరు, పింఛను హక్కులను సార్వత్రికం చేయడానికి, ధనవంతులపై పన్ను విధించాలని, కార్పొరేట్ పన్నును పెంచాలని ఎస్‌కెఎం కోరింది.








కామెంట్‌లు (0)