సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నాకు, విద్యార్థులకు మధ్యలో బిసిఐ ఎవరు?

14 ఆగస్టు, 2026

supremecourt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 12:52 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- నల్సార్ ఎన్‌రోల్‌మెంట్ల నిలిపివేత సర్క్యులర్‌ను ఖండించిన సిజెఐ

న్యూఢిల్లీ : నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌వ్యాఖ్యానించారు. ‘బొద్దింకలు’ అంటూ యువతను ఉద్ధేశించి గతంలో సిజెఐ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనను హైదరాబాద్‌‌లోని నల్సార్ లా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు ఇటీవల చేపట్టిన ప్రచారంపై విచారణ పెండింగ్‌లో ఉన్నందున, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నల్సార్‌ ‌లా యూనివర్సిటీ - 2026 బ్యాచ్‌ పట్టభద్రుల నమోదును నిలిపివేయాలని బిసిఐ రాష్ట్ర బార్ కౌన్సిళ్లను ‌గురువారం ఆదేశించింది. ఆ తరువాత తీవ్ర వ్యతిరేకత రావడంతో సర్క్కులర్‌‌ను ఉపసంహరించుకుంది. బిసిఐ తీరును సిజెఐ ఖండించారు. "విద్యార్థులకు, నాకు మధ్య రావడానికి బిసిఐ ఎవరు? విద్యార్థులపై ఇటువంటి విచారణలకు ఆదేశించే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేదు," అని ఆయన స్పష్టం చేశారు. నల్సార్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే అధికారం బిసిఐకి లేదని, తాను కూడా ఒకప్పుడు విద్యార్థిగానూ, రాజకీయాల్లోనూ ఉన్నానని అన్నారు. బిసిఐ సర్క్యులర్ల ఆధారంగా నల్సార్ విద్యార్థులు, నిర్వాహకులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ​ఈ అంశంపై సీనియర్‌ ‌న్యాయవాది కె. పరమేశ్వర్ మౌఖికంగా ప్రస్తావించడంతోపాటు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బిసిఐకి నోటీసు జారీ చేసి, కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. విద్యార్థులపై గానీ, విశ్వవిద్యాలయం నాలుగు గోడల మధ్య జరిగే విషయాలపై గానీ బిసిఐ క్రమశిక్షణా అధికార పరిధి లేదని పరమేశ్వర్ సుప్రీంకోర్టు ఎదుట ప్రస్తావించారు. ​బిసిఐ చర్యలు విద్యార్థుల భవిష్యత్తును, జీవనోపాధిని అణచివేసేందుకు చేసే బెదిరింపుతో సమానమని ఆయన తెలిపారు. సమష్టిగా ఆమోదించిన తీర్మానం తర్వాత బిసిఐ సర్క్యులర్‌ జారీ చేశారా లేక ఇది బిసిఐ ఛైర్‌పర్సన్, సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ మిశ్రా చొరవతో జరిగిందా అనే విషయంపై కోర్టు విచారణ జరపాలని కోరారు. పరమేశ్వర్‌ పిటిషన్‌‌తో కోర్టు ఏకీభవించి, ఈ విషయంపై అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని బిసిఐని ఆదేశించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్