గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నేటి నుంచి పూణేలో జూనియర్ మహిళల జాతీయ హాకీ ఛాంపియన్‌షిప్

1 రోజు క్రితం

hockey
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 08:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- 30 జట్ల మధ్య పోటీ

- ఆగస్టు 23 వరకు టోర్నీ

పూణే: 16వ హాకీ ఇండియా జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్‌షిప్ 2026 బుధవారం నుంచి పూణేలో ప్రారంభం కానుంది. మూడు డివిజన్లలో మొత్తం 30 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయి. ఆగస్టు 23 వరకు జరిగే ఈ పోటీల్లో జాతీయ టైటిల్‌తో పాటు తమ తమ డివిజన్లలో ప్రమోషన్, రిలెగేషన్ కోసం జట్లు తలపడనున్నాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో డివిజన్ 'ఎ', డివిజన్ 'బి', డివిజన్ 'సి'గా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ విధానం ద్వారా జట్లు తమ స్థాయిలో పోటీపడటంతో పాటు మెరుగైన ప్రదర్శనతో తదుపరి డివిజన్‌కు ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. డివిజన్ 'ఎ'లో 12 జట్లు నాలుగు పూల్స్‌గా విడిపోయాయి. పూల్ 'ఎ'లో జార్ఖండ్, పంజాబ్, చండీగఢ్ ఉండగా.. పూల్ 'బి'లో హర్యానా, ఒడిశా, బెంగాల్ ఉన్నాయి. పూల్ 'సి'లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్.. పూల్ 'డి'లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి.

డివిజన్ 'ఎ' లీగ్ దశ ఆగస్టు 16న ప్రారంభమవుతుంది. ప్రతి జట్టు తన పూల్‌లోని మిగతా జట్లతో తలపడుతుంది. ప్రతి పూల్‌లో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఆగస్టు 20న క్వార్టర్ ఫైనల్స్, ఆగస్టు 21న సెమీఫైనల్స్ జరగనున్నాయి. ఆగస్టు 23న మూడో స్థానం కోసం మ్యాచ్‌తో పాటు ఫైనల్ నిర్వహిస్తారు. డివిజన్ 'ఎ'లో జాతీయ ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం 12 జట్లు పోటీపడుతుండగా.. చివరి రెండు స్థానాల్లో నిలిచే జట్లు తదుపరి ఎడిషన్‌లో డివిజన్ 'బి'కి రిలెగేట్ అవుతాయి.

డివిజన్ 'బి'లో 10 జట్లు రెండు పూల్స్‌గా పోటీపడతాయి. పూల్ 'ఎ'లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, కేరళ, మిజోరం ఉండగా.. పూల్ 'బి'లో కర్ణాటక, ఉత్తరాఖండ్, తమిళనాడు, బీహార్, గోవా ఉన్నాయి. ఈ డివిజన్‌లో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు డివిజన్ 'ఎ'కు ప్రమోషన్ పొందుతాయి. చివరి రెండు స్థానాల్లో నిలిచే జట్లు డివిజన్ 'సి'కి పడిపోతాయి.

డివిజన్ 'సి'లో ఎనిమిది జట్లు రెండు పూల్స్‌గా బరిలోకి దిగుతున్నాయి. పూల్ 'ఎ'లో అరుణాచల్ ప్రదేశ్, దాద్రా & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ, రాజస్థాన్, త్రిపుర ఉండగా.. పూల్ 'బి'లో పుదుచ్చేరి, గుజరాత్, జమ్మూ & కాశ్మీర్, తెలంగాణ ఉన్నాయి. ఈ డివిజన్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు తదుపరి ఎడిషన్‌లో డివిజన్ 'బి'కి ప్రమోషన్ పొందుతాయి.

హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ మాట్లాడుతూ.. మూడు డివిజన్లలో జట్లు పోటీపడటం వల్ల యువ క్రీడాకారులకు విలువైన పోటీ అనుభవం లభించడంతో పాటు దేశీయ హాకీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్