- రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలి
- సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దశాబ్దాలుగా పట్టణాల పరిశుభ్రత, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తోన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్డ్, మృతి చెందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మహాత్మాగాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ ధర్నాచౌక్‌లో మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఒకరోజు దీక్ష నిర్వహించారు. తొలుత గాంధీజీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ వారసులమని చెప్పుకుంటున్న పాలకులు మున్సిపల్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్న కార్మికులకు రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలని, గ్రాట్యుటీ చట్టాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో కార్మికులతో అధిక పని చేయించుకుంటూ, వారి శ్రమకు తగిన ప్రయోజనాలు కల్పించకుండా పాలకులు అవార్డులు, రివార్డులు పొందుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో సమరశీల పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు 60 ఏళ్లకే రిటైర్మెంట్ చేస్తున్నప్పటికీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సక్రమంగా అందడం లేదని అన్నారు. గత ఆరేళ్లలో వేలాది మంది కార్మికులు రిటైర్ కావడం, మృతి చెందినప్పటికీ, వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పించలేదని ఆరోపించారు. ఖాళీ పోస్టులను ప్రజాప్రతినిధుల అనుయాయులతో భర్తీ చేస్తున్నారని విమర్శించారు.మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు, హెల్త్ కార్డులు అందించాలని, శాశ్వత స్వభావం కలిగిన విధులు నిర్వహిస్తోన్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే, కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె నాగభూషణ, ఉపాధ్యక్షులు టి నూకరాజు, డి వెంకట్రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలోపు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సునీల్, బి ముత్యాలరావు, వజ్రమ్మ, రాష్ట్ర కోశాధికారి ఎస్ జ్యోతిబస్, నాయకులు బి బలరాం, కె సాల్మన్, బేబీ, డి వరలక్ష్మి, పి శ్రీనివాసరావు, బాబు, ప్రవీణ్, రమాదేవి, వెంగమ్మ, ఎర్రిస్వామి, ఇమ్మానియేల్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)