లక్నో : సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) నేత అజమ్‌ఖాన్ ట్రస్ట్, యూనివర్శిటీలపై ఈడి దాడులకు దిగింది. అజమ్‌ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అజమ్‌ఖాన్‌కు చెందిన ‘మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ ట్రస్ట్’, యూనివర్శిటీ ప్రాంగణాల్లో సోదాలు చేపడుతున్నట్లు ఈడి అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యుపిలోని రాంపూర్, సహరాన్‌పూర్, ఢిల్లీలోని జామియా నగర్‌లో ఉన్న సుమారు 10 ప్రాంతాల్లో సిఆర్‌పిఎఫ్ బృందం సమక్షంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సహరాన్‌పూర్‌లో చార్టర్డ్ అకౌంటెంట్ నివాసంతో పాటు ట్రస్ట్‌కు సంబంధం ఉన్న రెండుకంపెనీలు, వాటి ప్రమోటర్లకు చెందిన నివాసాల్లో సోదాలు చేపడుతున్నారు.
ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా ప్రభుత్వ కాంట్రాక్టు నిధులను మళ్లించడం, ఆ నిధులను ట్రస్ట్, యూనివర్శిటీకి ఆస్తులుగా మళ్లించడం సహా వివిధ అవసరాలకు వినియోగించినట్లు ఈడి పేర్కొంది. లక్నో కేంద్రంగా పనిచేస్తున్న ఈ ట్రస్ట్‌కు అజమ్‌ఖాన్ ప్రధాన ట్రస్టీగా వ్యవహరిస్తుండగా, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు సభ్యులుగా ఉన్నారు. ఈ ట్రస్ట్ మహమ్మద్ అలీజౌహర్ యూనివర్శిటీ, రాంపూర్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలను నిర్వహిస్తోంది.
1973 నాటి ఉత్తర ప్రదేశ్ పట్టణ ప్రణాళిక, అభివృద్ధి చట్టం ప్రకారం ఆమోదం లేకుండా భవనాలు నిర్మించారని ఆరోపిస్తూ, రాంపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్‌డిఎ) గత జులై నెలలో యూనివర్శిటీకి చెందిన 40 భవనాల్లో 38 భవనాలను కూల్చివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. భవనాల కూల్చివేతపై యూనివర్శిటీ విద్యార్థుల నిరసనలతో డివిజనల్ కమిషనర్ కూల్చివేతపై స్టే విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎటువంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశించారు. అయితే యుపి ప్రభుత్వ చర్యపై సమాజ్‌వాదీ, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డాయి.








కామెంట్‌లు (0)