సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

తప్పు తెలుసుకున్న పావురం

3 రోజుల క్రితం

story
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 03:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఒక చెట్టుపై చిలుక, పావురం ఎంతో స్నేహంగా ఉండేవి. అవి పక్కపక్కనే గూళ్లు కట్టుకుని నివసించేవి. ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవించేవి. కొంతకాలానికి రెండింటికీ పిల్లలు పుట్టాయి. వాటి రాకతో చిలుక, పావురం స్నేహం మరింత బలపడింది. పిల్ల పక్షుల కేరింతలతో రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఒకరోజు ఆ దారిన వెళ్తున్న కొందరు బాటసారులు చెట్టుపై ఆగారు. చిలుక పిల్లలు ముద్దుగా పలుకుతున్న మాటలు విని మురిసిపోయారు. ‘చిలుక పిల్లలు ఎంత బాగా మాట్లాడుతున్నాయో చూశారా! మనుషుల మాటలను చిన్నపిల్లల్లా అనుకరిస్తూ పలకడం ఎంత ముచ్చటగా ఉందో!’ అని మెచ్చుకున్నారు. బాటసారుల మాటలు విన్న చిలుక పిల్లలు కూడా వాటినే ముద్దుగా పలకసాగాయి.

ఆ మాటలన్నీ పావురం విన్నది. మొదట చిలుక పిల్లలను అందరూ మెచ్చుకోవడం చూసి సంతోషించింది. కానీ కొద్దికొద్దిగా దాని మనసులో అసూయ చోటు చేసుకుంది. ‘నా పిల్లలు కూడా అందంగానే ఉన్నాయి. మరి అందరూ చిలుక పిల్లలనే ఎందుకు పొగడుతున్నారు?’ అని ఆలోచించింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ అసూయ పెరిగిపోయింది. చివరకు ఒకరోజు చిలుక పిల్లలకు కీడు తలపెట్టాలని నిర్ణయించుకుంది. ‘వాటిని గూటి నుంచి కిందకు తోసేస్తే... ఇక ఎవరూ వాటిని పొగడరు’ అని అనుకుంటూ మెల్లగా చిలుక గూటి దగ్గరకు వెళ్లింది. అదే సమయంలో చిలుక పిల్లలు భయంతో గట్టిగా అరవడం ప్రారంభించాయి.

‘పావురం అత్తా... పాము... పాము... మీ గూటి వైపు వస్తోంది!’ అని కేకలు వేశాయి. మొదట పావురం వాటి మాటలు నమ్మలేదు. కానీ వెనక్కి తిరిగి చూసేసరికి నిజంగానే ఓ పెద్ద పాము తన గూటివైపు పాకుతూ వస్తోంది. వెంటనే అది ఎగిరి వెళ్లి తన ముక్కుతో పామును గట్టిగా పొడవడం ప్రారంభించింది. దాంతో గాయపడిన పాము అక్కడి నుంచి పారిపోయింది. అప్పుడు పావురానికి తన తప్పు అర్థమైంది. ‘నేను అసూయతో చిలుక పిల్లలకు హాని చేయాలనుకున్నాను. కానీ అవే నా పిల్లల ప్రాణాలను కాపాడాయి. ఎంత గొప్ప మనసు!’ అని పశ్చాత్తాపపడింది. వెంటనే చిలుక దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పి క్షమాపణ కోరింది.


- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర

బీటెక్ మూడో సంవత్సరం (ఈసీఇ)

ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల,

ఖమ్మం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్