ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖ బీచ్లో మద్యం విక్రయాలను సమర్థిస్తూ ఎంపి భరత్ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యం, ప్రజావ్యతిరేకమైనవని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఎంపి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజలు మద్యం తాగకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది? అనే ఎంపి వ్యాఖ్య ప్రజాప్రతినిధిగా చేసిన వ్యాఖ్య కాదు, మద్యం వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్ చేసిన వ్యాఖ్యగా ఉందని పేర్కొంది. ప్రజల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధి మధ్యపానాన్ని సమర్ధించడం సిగ్గుచేటని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె శ్రీదేవి, వి సావిత్రి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వేలాది కుటుంబాలు మద్యం కారణంగా ఆర్థికంగా, సామాజికంగా ఛిన్నాభిన్నం అవుతున్నాయని, మహిళలపై హింస, కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో బీచ్‌లలో మద్యం విక్రయాలను ప్రోత్సహించడం అంటే సమస్యలను మరింత తీవ్రతరం చేయడమేనన్నారు. పర్యాటకాభివృద్ధి అంటే మద్యం దుకాణాలు పెట్టడం కాదని, ప్రపంచ స్థాయి సదుపాయాలు, పరిశుభ్రత, భద్రత, సాంస్కృతిక కార్యకలాపాలు, పర్యావరణ పరిరక్షణతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఎంపి భరత్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. ప్రభుత్వం బీచ్‌లలో మద్యం విక్రయాల నిర్ణయాన్ని రద్దు చేయాలని, లేనిపక్షంలో మహిళలను, ప్రజలను సమీకరించి ఐద్వా ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఎంపి భరత్ వ్యాఖ్యలు దుర్మార్గం
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 18, 2026, 01:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)