mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ సహకారముతో విద్యుత్ బస్సులను ఆర్టీసీ నిర్వహించాలి

1 రోజు క్రితం

apsrtc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 17, 2026, 07:32 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • జూన్ 23, 24 తేదీల్లో గేటు ధర్నాలు

  • ఉద్యోగ సంఘాల జెఎసి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రభుత్వ సహకారముతో విద్యుత్ బస్సులను ఆర్టీసీ నిర్వహించాలని ఉద్యోగ సంఘాల జెఎసి ఏక్రగీవంగా డిమాండ్ చేసింది. జూన్ 23, 24 తేదీల్లో గేటు ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆర్టిసిలో విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్లు నిర్వహించడానికి వ్యతిరేకంగానూ, అలాగే పిఆర్సి, డిఏ, సరెండర్ లీవు బకాయిలు ఇవ్వాలని డిమాండు చేస్తూ బుధవారం ఉదయం విజయవాడ ఎంబివికెలో ఆర్టిసి కార్మిక సంఘాల జెఎసి సమావేశం జరిగింది. విద్యుత్ బస్సులను సంస్థే నిర్వహించాలని, లీజుకు ఇచ్చిన డిపోలను ప్రభుత్వం ఆర్టిసి స్వాధీనం చేసుకోవాలని డిమాండు చేసింది. ఈ సందర్భంగా జెఎసి కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, జి.వి.నరసయ్య మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రవేటు వారి ద్వారా నడుపుతూ విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రవేటు వారికి అప్పగించే చర్యలను మానుకోవాలని హెచ్చరించారు. స్త్రీ-శక్తి పథకము అమలు తరువాత ఏర్పడిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, దాదాపు 15 సంవత్సరాలు నుండి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయని కారణంగా ఉద్యోగుల కొరతతో స్త్రీ-శక్తి పథకము అమలు కష్టంగా మారిందని తెలిపారు. ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగినందున వెంటనే 4000 వేలు డీజిల్ బస్సులు కొనాలని, 10,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వం చెల్లించవలసిన డిఎ బకాయిలు, పిఆర్సి బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండు చేశారు. 12 వ పిఆర్సి కమిషన్ వేసి వెంటనే ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డిఎలు ఇవ్వాలని కోరారు. అలాగే ఆర్టీసీలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో ప్రవేశపెట్టనున్న విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ నిర్ణయాన్ని విరమించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కో కన్వీనర్లు సిహెచ్.సుందరయ్య, ఎస్.కె.జిలానీ భాష, పి.వి.రమణారెడ్డి, ఎం.డి.ప్రసాదు, ఎస్.వి.శేషగిరిరావు, కెఎస్పిరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల కొనుగోలుకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రైవేట్ ఆపరేటర్లకు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం వినియోగించుకుని, విద్యుత్తు బస్సులను స్వయంగా ఆర్టీసీ సంస్థ కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం, యాజమాన్యం ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రైవేట్ ఆపరేటర్లకు విద్యుత్ బస్సులతో పాటు విలువైన డిపో స్థలాలను లీజు పేరుతో అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. ఈ విధానం ఆర్టీసీ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడంతో పాటు, ప్రైవేటీకరణకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాల నుండి ప్రభుత్వ రంగ సంస్థగా ఆర్టీసీ కోట్లాది మంది ప్రజలకు సేవలందిస్తోందని, పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులను పెంచి, ఉద్యోగ నియామకాలు చేపట్టి సంస్థను మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రైవేటీకరణకు దారితీసే విధానాలు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు, స్త్రీ-శక్తి పథకం అమలుతో ఉద్యోగులపై పడుతున్న అదనపు భారం తగ్గించాలన్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఐఆర్ ప్రకటించడం, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పెండింగ్ డిఏలు, 11వ పీఆర్సీ బకాయిల చెల్లింపు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల పరిష్కారం తదితర ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. వీటిపై జూన్ 11న జేఏసీ డిమాండ్లతో కూడిన వినతిపత్రం మరియు ఉద్యమ కార్యాచరణను ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు, ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. ఉద్యమ కార్యాచరణలో బాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జోన్లలో సదస్సులు ఏర్పాటు చేసి ఉద్యోగులను సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 20 తేదీ లోపు అన్ని జోన్లలో సదస్సులు పూర్తి చేస్తామని అప్పటికి సమస్యలు పరిస్కారానికి నోచుకోకపోతే జూన్ 23, 24 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తముగా అన్ని డిపోలు, యూనిట్లలో ఎర్ర రిబ్బన్ ధరించి విధులకు హాజరై, గేటు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. తదుపరి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జె.ఎ.సి సమావేశం జూన్ 28 వ తేదీన విజయవాడలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో జోన్ జెఎసి నాయకులు వై.యస్.రావు, అడపా రామారావు తదితరులు మాట్లాడారు. ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ అధ్యక్షులు జి.చిరంజీవి సభకు అధ్యక్షత వహించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్