mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.కోటి పరిహారమివ్వాలి

10 జూన్, 2026

ys jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 12:50 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం


ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ, గాజువాక (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి చొప్పున పరిహారం అందించడంతో పాటు, కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఈ బాధ్యతను నిర్వర్తించని పక్షంలో భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడి సెవెన్‌హిల్స్‌, కిమ్స్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో జగన్‌ మాట్లాడుతూ.... బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటిస్తున్న సహాయం సరిపోదన్నారు. మృతుల కుటుంబాలకు ఉద్యోగి హక్కుల ప్రకారం సుమారు రూ.1.72 కోట్లు, బీమా, పిఎఫ్‌, గ్రాట్యుటీ తదితర ప్రయోజనాల రూపంలో మరో రూ.1.45 కోట్లు లభిస్తాయని, ఇవన్నీ ఉద్యోగులకు హక్కుగా వచ్చే మొత్తాలేనని, రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా అందించే ప్రత్యేక సహాయం ఏమిటో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. మంత్రి లోకేష్‌ ‌చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని, మానవత్వం అనేది ఎవరికైనా కొద్దో గొప్పో ఉండాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాధిత కుటుంబాల పట్ల సానుభూతి చూపకుండా అహంకారపూరితంగా మాట్లాడడం బాధకరమన్నారు.
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసిందని గుర్తు చేశారు. 2021లో ప్రధానమంత్రికి రెండు లేఖలు రాశామని, అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. గతంలో ప్లాంట్‌లో 28 వేల మంది ఉద్యోగులు పనిచేస్తే, ప్రస్తుతం ఆ సంఖ్య 16 వేలకు పడిపోయిందని, 6,500 మంది కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించారని, 1,800 మందికి విఆర్‌ఎస్‌ అమలు చేశారని, మరో 2,500 మంది ఉద్యోగ విరమణ చేశారని పేర్కొన్నారు. ఉద్యోగులకు నాలుగున్నర నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, బోనస్‌, మెడికల్‌ సదుపాయాలు, హెచ్‌ఆర్‌ఎ వంటి అనేక ప్రయోజనాలు నిలిపివేశారని విమర్శించారు. కేంద్రం ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీని సంస్థ భద్రత, ఆధునికీకరణ కోసం కాకుండా రుణాలు, బకాయిల చెల్లింపులకే వినియోగించారని ఆరోపించారు. ప్రస్తుత ప్రమాదంలో కార్మికుల తప్పిదం లేదని, ముడి పదార్థాల నాణ్యత లోపాలు, నిర్వహణలో నిర్లక్ష్యమే కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబాలకు మానవత్వంతో ప్రభుత్వం అండగా నిలవాలని కోరిన జగన్‌, అవసరమైతే గత ప్రమాదాల్లో నష్టపోయిన కుటుంబాలకు కూడా సహాయం అందిస్తామని తెలిపారు. ​


షీలానగర్ కిమ్స్ ఆసుప్రతిలో పరామర్శ

కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జి.అప్పారావు, సత్యానంద బాలు, మల్లికార్జున రావును జగన్‌ పరామర్శించారు. ప్రమాదం ‌జరిగిన తీరు, వైద్య సేవల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి బాధితులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్