మాజీ మంత్రి పేర్ని నాని
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రౌడీ షీటర్ అయినంత మాత్రాన పోలీసులు చంపేస్తారా ? దీనిపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సాయికృష్ణది పోలీసులు చేసిన హత్యేనని, కొడుకు ఆచూకీ తెలియక తల్లి వ్యథ పడుతూ పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యమని అన్నారు. శవం కూడా దొరక్కుండా కాల్చేశారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే చంపేస్తే ఇక కోర్టులెందుకు అని ప్రశ్నించారు. చనిపోయిన సాయికృష్ణపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, ఎన్నికల్లో వాడుకున్నప్పుడు ఇవన్నీ గుర్తులేదా ? అని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్డి లేదా సీబీఐ దర్యాప్తు చేయించాల్సిందేనని అన్నారు. విజయవాడలో క్షీణించిన శాంతిభద్రతలకు విజయవాడలో పోలీసుల చేతిలో హత్యకు గురైన సాయికృష్ణ ఉదంతమే నిదర్శనమని అన్నారు. పోలీసులే ఎత్తుకొచ్చి,చంపేసి, శవం కూడా దొరక్కుండా కాల్చేస్తే ఇక చట్టం ఎందుకు ? కోర్టులెందుకని పేర్ని నాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాయికృష్ణ హత్యపై సిట్టింగ్ జడ్డి లేదా సిబిఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని పేర్ని నాని డిమాండ్ చేశారు.
మే 9న గాదె విజయలక్ష్మి అనే మహిళ ఇంటికి విజయవాడ కృష్ణలంక పోలీసులు వెళ్లి దౌర్జన్యంగా ఫోన్ లాక్కున్నారని, ఫోన్ ఆధారంగా ఆమె కుమారుడు సాయికృష్ణను ప్రకాశం జిల్లా నుంచి ఎత్తుకొచ్చారని తెలిపారు. రాత్రి అనుమానం వచ్చి కుమారుడికి ఫోన్ చేస్తే కలవలేదని, ఆమె మార్కాపురం వెళ్లి కొడుకు గురించి ఆరా తీస్తే సీసీ ఫుటేజ్ దొరికిందని, ఆరు రోజుల పాటు స్టేషన్లకు తిరిగినా, పోలీసుల కాళ్లు పట్టుకుని ఏడ్చినా సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. విజయవాడ సిటీ పరిధిలో పోలీసులు చట్టం, న్యాయం, కోర్టులంటే లెక్కలేకుండా ప్రవర్తిస్తున్నారంటే, నియంత పాలన సాగిస్తున్నారంటే రాజశేఖర్ బాబుకు బాధ్యత లేదా ? పోలీసులు తన కొడుకుని చంపేస్తున్నాడని తల్లి ఫిర్యాదు చేసినా ఎందుకు అడ్డుకోలేకపోయారుని ప్రశ్నించారు. తన కొడుకుని కాల్చేస్తే అస్తికలు అయినా ఇవ్వండి, బూడిద అయినా ఇవ్వండని అడుగుతున్నా స్పందించడం లేదని, 15వ తేదీన కోర్టులు తెరుస్తున్నారని తెలిసి సీఐ నాగరాజును బదిలీ చేసి మురళీకృష్ణకు బాధ్యతలు ఇచ్చారని అన్నారు. మరోవైపు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితను కించ పరిచేలా మాట్లాడారంటూ కూటమి నేతలు చేస్తున్న ప్రచారాలపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. హోంమంత్రి అనిత గతంలో వైఎస్సార్సీపీ నేతలపై, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మహిళలపై చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై ఎందుకింత రచ్చ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆయన మేకప్ గురించి మాత్రమే మాట్లాడారని, పవన్ మాత్రం కట్టూబొట్టూ డైలాగులు చెప్తున్నారని అన్నారు. నిత్యం సభ్యత లేకుండా హోంమంత్రి విమర్శలు చేస్తున్నారని, వైఎస్సార్సీపీని తిట్టడానికే అనిత పనికొస్తున్నారని తెలిపారు. ఒక్క రోజైనా హోంమంత్రి బాధ్యతగా వ్యవహరించారా ? సంస్కారవంతంగా మాట్లాడారా ? ఓ మాజీ మంత్రిని పట్టుకుని ఎవడో మాట్లాడుతున్నాడని హోంమంత్రి చెప్పలేదా ?, మీ ఇష్టం గుడ్లు కావాలంటే పగలగొట్టుకుని ఫ్రైడ్ రైస్ లు వండుకోండి. కానీ హోంమంత్రి గారి నోటికి హద్దు ఉండాలని అన్నారు. ముందు మీరు సభ్యతగా విమర్శలు చేయండి. చంద్రబాబు, లోకేష్ మీకు హోంమంత్రి కుర్చీ ఇచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల్ని కించపర్చడానికి పనిముట్టుగా వాడుకుంటున్నారని అన్నారు. వాయనం ఇస్తే తిరిగి వాయనం ఇస్తారన్న విషయం టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు.









కామెంట్‌లు (0)