- బ్రిక్స్ దేశాల మంత్రుల సమావేశం తీర్మానం
భోపాల్ : బ్రిక్స్ దేశాలు, భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించడానికి, వ్యవస్థాగత చట్ర పరిధిని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన భోపాల్ డిక్లరేషన్‌ను బ్రిక్స్ దేశాల సాంస్కృతిక మంత్రులు శనివారం ఆమోదించారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. సమకాలీన, సాంప్రదాయ సాంస్కృతిక, వారసత్వ రంగాలన్నింటికీ వర్తించేలా ఒక ప్రణాళను రూపొందించడం, బ్రిక్స్ దేశాల మధ్య సాంస్కృతిక రంగ సహకారాన్ని పటిష్టపరచడం ఈ డిక్లరేషన్ ముఖ్య లక్ష్యమని చెప్పారు. భారత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 14 దేశాలు పాల్గొన్నాయి. వీటిలో 10 సభ్య దేశాలు కాగా, నాలుగు భాగస్వామ్య దేశాలు. 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు బ్రిక్స్ సాంస్కృతిక ఉత్సవాలు కూడా ఇక్కడ జరిగాయి. సాంస్కృతిక, సృజనాత్మక పరిశ్రమలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారాన్ని పంచుకోవడమే ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశమని ఆయన స్పష్టం చేశారు. అనుసరించే పద్దతులు, అనుభవాలను పరస్పర పంచుకుంటూ ఎదుటివారి నుండి మనం ఏమి నేర్చుకోగలం, సృజనాత్మక కళాకారులకు ఎలా సహాయ పడగలమనే అంశాలపై మెరుగైన నెట్‌వర్కింగ్‌ను ఈ డిక్లరేషన్ మనకుఅందిస్తుందన్నారు. కృత్రిమ మేథస్సు రంగంలో కాపీరైట్ రచనలను ఉపయోగించేటపుడు పారదర్శకత వుండాలని పేర్కొంది. అలాగే సృజనాత్మక కళాకారులకు న్యాయమైన పారితోషికం అందాలని పేర్కొంది. మ్యూజియంలు, లైబ్రరీలు, ఆర్కైవ్‌ల మధ్య కూడా సహకారాన్ని బలోపేతం చేయాలని డిక్లరేషన్ పిలుపిచ్చింది. సాంస్కృతిక మార్పిడులు, వృత్తిపరమైన నెట్‌వర్కింగ్‌కు వెసులుబాటు కల్పించేలా, కళాకారులకు, సృజనాత్మక ప్రాక్టీషనర్లకు బ్రిక్స్ దేశాల్లో మంచి అవకాశాలు లభించేలా చూసేందుకు ప్రాయోగిక పద్దతిన స్వచ్ఛంద కళాకారుల రిజిస్ట్రీని ఏర్పాటు చేయనున్నట్లు భారత్ ప్రకటించింది. ఏడాది కాలంలో ఒక దేశం ఒకవారసత్వ ప్రదేశాన్ని నామినేట్ చేయడానికి అవకాశం వుంటుందని కానీ ఒకవేళ పలు దేశాలు ఏకపక్షంగా లేదా ద్వైపాక్షికంగా లేదా బహుముఖంగా నామినేషన్‌కు ముందుకు వస్తే అప్పడు సంఖ్యపై పరిమితి వుంటుందని మంత్రి చెప్పారు.







కామెంట్‌లు (0)