mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖ స్టీలు ఫ్యాక్టరీ ప్రమాదంలో సాహసం చూపిన కార్మికులకు అభినందనలు

10 జూన్, 2026

cpim ap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 01:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

– ప్యాకేజీ ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన సమయంలో సాహసం చేసి పలువురి ప్రాణాలను కాపాడిన తోటి కార్మికులకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. విశాఖ స్టీలు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో తోటి కార్మికులను కాపాడేందుకు అదే ఫ్లోర్‌లో ఉన్న ఇతర కార్మికులు ప్రాణాలకు తెగించి కొంతమందిని కాపాడగలిగారని తెలిపారు. 9వ తేదీ సిపిఎం ప్రతినిధివర్గం ఫ్యాక్టరీని సందర్శించిన సందర్భంలో అనేక వాస్తవాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు. అదే సమయంలో డ్యూటీలో ఉన్న సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.ఎం. శ్రీనివాసరావు మంటలకు ఎదురేగి ఇతర కార్మికులను కూడగట్టి ధైర్యం చెప్పి కొంతమందిని తక్కువ నష్టంతోనూ, మరికొంత మందిని గాయపడకుండా బయటకు తీసుకురాగలిగారని పేర్కొన్నారు. అయినప్పటికీ ఉధృతంగా ఆకస్మికంగా వచ్చిన మంటలతో తోటి కార్మికుల కళ్లెదుటే ఎనిమిదిమంది మరణించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఫ్యాక్టరీని కాపాడుకోవడంలో కార్మికులు, కార్మిక సంఘాల తెగువను, పట్టుదలను సిపిఎం అభినందిస్తోందని పేర్కొన్నారు.
సంఘటన ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు పవన్ కల్యాణ్, లోకేష్‌ కార్మికులు చేస్తున్న కృషిని అభినందించడానికి బదులుగా కార్మికులపై నెపం వేయడం, కార్మిక సంఘాలను నిందించడాన్ని తీవ్రంగా ఖండించారు. కె.జి.హెచ్.దగ్గర మృతుల కుటుంబాలను సిపిఎం ప్రతినిధివర్గం పరామర్శిస్తున్న సమయంలోనే మంత్రి లోకేష్ వస్తున్నారని సెక్యూరిటీ సిబ్బంది వారిని పక్కకు తోసేశారని, ఒక జాతీయ రాజకీయ పార్టీ నాయకులు అక్కడున్నారన్న కనీస మర్యాదను కూడా పాటించలేదని వివరించారు. అయినప్పటికీ సిపిఎం ప్రతినిధివర్గం పక్కకు తప్పుకొని లోకేష్‌ను ఆహ్వానించిందని తెలిపారు. అక్కడే ఉన్న కార్మికులు, కార్మికసంఘాల నాయకులు చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని అడుగుతుండగా దాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించడమే కాకుండా ఎన్డీఏ ప్రభుత్వ గొప్పతనాన్ని చెప్పుకుపోవడంతో కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నించారని వివరించారు. దీన్ని సహించలేని లోకేష్ అసహనం వ్యక్తం చేయడం, కార్మిక సంఘాలకు దురభిప్రాయాలు అంటగట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కార్మికుల కోర్కెను విని సమాధానం చెప్పడానికి బదులు ప్రశ్నించడాన్ని రాజకీయమనడమే ఒక రాజకీయమని విమర్శించారు. కోటి రూపాయల సహాయాన్ని పక్కదారి పట్టించడానికే లోకేష్ రాజకీయం చేశారని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్లాంట్‌లో ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వాస్తవాలతో సహా సిపిఎం ప్రతినిధివర్గం మీడియాకు వివరించిందని పేర్కొన్నారు. బుధవారం ఒక తెలుగు పత్రికలో “ఉక్కు భద్రత తక్కువ” అనే పేరుతో వచ్చిన కథనం మరో పత్రిక రాసిన సంపాదకీయం “మాటలకందని విషాదం” సిపిఎం అభిప్రాయం సరైందని రుజువు చేస్తున్నాయని తెలిపారు. ప్యాకేజీ గొప్పతనం గురించి పదేపదే చెబుతున్న కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేష్ ఆ డబ్బులు ఏమయ్యాయో వివరించాలని డిమాండ్ చేశారు. పొదుపు పేరుతో కనీస నిధులు కూడా ఇవ్వకుండా, స్పేర్ పార్ట్స్ ఇవ్వకుండా, నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కేంద్ర ఉక్కుశాఖ దీనికి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. 20 రోజులుగా బబుల్స్ ను నిరోధించే కీలకమైన బ్యాటరీ పర్జింగ్ ట్యూబ్‌ను సమకూర్చలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే కొత్తగా ప్రారంభించబోతున్న మిట్టల్ ఫ్యాక్టరీ కోసం పడుతున్న తపనలో ఒకశాతం కూడా విశాఖ ఉక్కుపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని పేర్కొన్నారు. దీనికి సమాధానం ఇవ్వకుండా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తప్పించుకుంటున్నారని విమర్శించారు. పైగా కార్మిక సంఘాలపై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ రెండేళ్లలో 7500 మంది నిపుణులైన కార్మికులను తగ్గించి, ఉన్నవారిపై ఒత్తిడి పెంచి 1600 డిగ్రీల వేడిలో పనిచేస్తున్న కార్మికుల కష్టాన్ని కూడా వారు గుర్తించలేదని పేర్కొన్నారు. నెలల తరబడి సగం సగం జీతాలు ఇస్తున్నా ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు ధారపోస్తున్న శ్రమను గుర్తించకుండా నిందించడం శ్రమను అవమానించడమేనని తెలిపారు. కార్పొరేట్ల సేవలో నిండా మునిగిపోయిన ఈ ప్రభుత్వాలకు కార్మికుల కష్టం అర్థం కావడం కష్టమేనని, ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటూ దాని పరిరక్షణకోసం కృషి చేస్తున్న కార్మికులు, కార్మిక సంఘాల పోరాటానికి సిపిఎం తరుపున మరోసారి మద్దతు ప్రకటించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్