- 23 నుంచి పరీక్షలు
- 94 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
- మెహాందీ ఉంటే అనుమతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ సంస్థల్లో విడుదల చేసిన అసిస్టెంట్ ఎగ్జీక్యూటీవ్ ఇంజనీరింగ్(ఎఇఇ) 629 పోస్టులకు 1,05,566 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్‌కో పరిధిలో 200, ఎపిఇపిడిసిఎల్ పరిధిలో 135, ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో 134, ఎపిసిపిడిసిఎల్ పరిధిలో 60, జెన్‌కో పరిధిలో 100 చొప్పున భర్తీ జరుగుతున్నాయి. ఈ నెల 23 నుంచి 27వ తేది వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సిబిటి) విధానంలో రెండు పూటలా పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశామని ఎపి ట్రాన్‌కో జెఎండి సూర్యసాయి ప్రవీణ్‌చంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.మొత్తం 94 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో 81, రాష్ట్రం వెలుపల 13 కేంద్రాల చొప్పున ఉన్నాయని వివరించారు. పకడ్బందీగా, పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించేందుకు భద్రతా చర్యలు చేపట్టామని వివరించారు. బయోమెట్రిక్ ధృవీకరణ, సిసి కెమెరాల పర్యవేక్షణ, కేంద్రస్థాయి మానిటరింగ్‌తో పాటు పటిష్టమైన పరిపాలనా, భద్రతా చర్యలు చేపట్టామన్నారు. పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నపత్రం, సమాధానాల సమాచారాన్ని అక్రమంగా ప్రసారం చేయకుండా భారత్ ఎలక్ర్టానిక్స్ లిమిటేడ్(బిఇఎల్) సమన్వయంతో మొబైల్ జామర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడలోని విద్యుత్ సౌధలో ఏర్పాటు చేసిన కేంద్ర కమాండ్ కంట్రోల్ నుంచి అన్ని పరీక్షా కేంద్రాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్ధుల ఫింగర్ ప్రింట్, థంబ్ ఇంప్రెషన్, ఫోటో క్యాప్చర్ నిర్వహిస్తారని, ఒరిజినల్ ఫోటో ఐడిని ఇన్విజిలేటర్లు పరిశీలిస్తామని పేర్కొన్నారు. బయోమెట్రిక్ నమోదుకు ఇబ్బంది లేకుండా అభ్యర్ధులు మెహందీ, హెన్నా, ఇంక్ వంటి పదార్ధాలు రాసుకోకూడదని సూచించారు. ఈ నెల 14 నుంచి అభ్యర్ధుల హాల్ టికెట్లను రిక్రూట్‌మెంట్ పోర్టల్ apvidyutrecruitment. apc fs s. inలో విడుదల చేశామని పేర్కొన్నారు. పరీక్షలు ముగిసిన మూడు రోజుల్లో ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. పైనల్ ఆన్సర్ కీ, నార్మలైజ్డ్‌స్కోర్లు, మెరిట్ జాబితాను సెప్టెంబర్ చివరిలో విడుదల చేస్తామన్నారు. 1:1 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అభ్యర్ధులకు ఉంటుందన్నారు.








కామెంట్‌లు (0)