- టిడిపి ఎమ్మెల్సీ వర్ల రామయ్య
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ఎమ్మెల్సీలు శాసనమండలి ఔన్నత్యాన్ని దిగజార్చారని, వారు వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించిందని టిడిపి ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దల సభగా పిలిచే శాసన మండలిలో చర్చలు, సమీక్షలు, బిల్లులపై సూచనలు జరగాల్సి ఉండగా నినాదాలు, అరుపులు, ప్లకార్డులు, గందరగోళంతో సభా కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజున సభ వాయిదా పడటంతో ఎలాంటి సభ కార్యక్రమాలు జరగలేదన్నారు. వైసిపి సభ్యులు సభలో నినాదాలు చేస్తూ సెల్ఫీలు తీసుకుని వాటిని జగన్ మోహన్ రెడ్డికి పంపుతున్నారని, జగన్ నుంచి వాటికి ప్రోత్సాహం లభిస్తోందని వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్‌ను వైసిపి సభ్యులు అవమానకరంగా సైగలు చేస్తూ, అసభ్యకరమైన రీతిలో వ్యవహరించారని తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన సభను వైఎస్ జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం అల్లరిపాలు చేస్తున్నారు. మెగా డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. వైసిపి లేవనెత్తుతున్న ప్రశ్నలకు సంబంధిత అధికారులు ఇప్పటికే సమాధానాలు ఇచ్చారని
చెప్పారు. రాబోయే రోజుల్లో నిజమైన “పెద్దల సభ”గా గౌరవంగా, సజావుగా పనిచేసేలా వైసీపీ సహకరించాలని కోరారు.








కామెంట్‌లు (0)