- ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని పరిశీలించిన సిఎం చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదారమ్మ నీటి పరవళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళుతున్న సమయంలో ప్రకాశం బ్యారేజ్‌పై కొద్దిసేపు తన వాహన శ్రేణిని నిలిపిన ముఖ్యమంత్రి గోదావరి నీటితో నిండు కుండలా ఉన్న బ్యారేజ్‌ను సందర్శించారు. గోదావరి నీటితో బ్యారేజ్ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 17.52 టిఎంసిల నీటిని గోదావరి నుంచి కృష్ణా నదికి తరలించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటి వరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు తెలిపారు. పట్టి సీమ ప్రాజెక్టు ద్వారా సమృద్దిగా గోదావరి జలాలు వస్తున్న నేపధ్యంలో ప్రకాశం బ్యారేజి దిగువన వివిధ కాలువల ద్వారా కృష్ణా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి ఆదేశించారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి 3,928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 3,115 క్యూసెక్కులు, గుంటూరు చానల్ నుంచి 115 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా సిఎం దృష్టికి తెచ్చారు. డెల్టాకు నీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాబావ పరిస్థితుల్లో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్‌నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందుల్ని అధిగమించేందుకు అన్ని విధాలా పనిచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.








కామెంట్‌లు (0)