- ఏర్పాట్లు చేస్తున్న ఎపిఎస్‌ఆర్‌టిసి యాజమాన్యం
- డిపోలన్నీ ప్రధాన రోడ్లలో ఉన్నవే
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : విద్యుత్ బస్సుల పేరుతో డిపోలను ప్రైవేటుపరం చేస్తున్న ఎపిఎస్‌ఆర్‌టిసి యాజమాన్యం మరో 29 డిపోలనూ విద్యుత్ బస్సుల నిర్వహణ పేరుతో ప్రైవేటుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 1,050 బస్సుల కొనుగోలు పేరుతో నాలుగు డిపోలను పూర్తిగా, ఎనిమిది డిపోలను 50 శాతం ప్రైవేటువారికి ఇస్తున్న సంగతి తెలిసిందే. నూతనంగా తీసుకొచ్చిన ఎపి ఎలక్ర్టిసిటీ మొబిలిటీ పాలసీలో భాగంగా 2029 నాటికి ఆర్‌టిసిలో పూర్తిగా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు. ఈ మేరకు 2029 నాటికి ఇప్పుడు వస్తున్న బస్సులు కాకుండా కొత్తగా 1,450 బస్సులు తీసుకురానున్నారు. దీనికోసం 29 డిపోలను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించారు. ఆదోని, ఎమ్మిగనూరు, తాడిపత్రి డిపోల్లో 50 శాతం వాటా అప్పగించనున్నారు. విద్యుత్ బస్సుల నిర్వహణలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన నాలుగు డిపోల్లో సిబ్బందిని ఆర్‌టిసి వేర్వేరు డిపోలకు బదిలీ చేసింది. ఇప్పుడు సిబ్బంది ఎక్కడికైతే వెళ్లారో అక్కడ కూడా విద్యుత్ బస్సుల పేరుతో డిపోలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం అంటే ఇప్పుడున్న వారిని ఇంకెక్కడికి పంపిస్తారనేది ప్రశ్నగా ఉంది. పంపించకపోతే ఇంటికేనా అనేది ఇప్పుడు ఉద్యోగ సంఘాల్లో చర్చ జరుగుతోంది. అంతిమంగా ఆర్‌టిసి ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం ద్వారా బస్సుల నిర్వహణపైనా, సిబ్బందిపైనా సంస్థ పట్టుకోల్పోతుంది. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ పథకాల అమలు కూడా ప్రశ్నార్థకమవుతుంది.
ప్రధాన రహదారుల్లో డిపోలే అధికం
కొత్తగా విద్యుత్ బస్సుల ఏర్పాటు కోసం సిద్ధం చేస్తున్న 29 డిపోల్లో అత్యధిక భాగం జాతీయ రహదారికి ఆనుకునే ఉన్నాయి. మరికొన్ని డిమాండు ఉన్న డిపోలు. విద్యుత్ బస్సుల పేరుతో అవన్నీ ప్రైవేటుపరమైతే ఆర్‌టిసి సంస్థ నిర్వహణ కష్టమవుతుందనేది ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రైవేటు ప్రతిపాదన డిపోలు ఇవే..
శ్రీకాకుళం-2, పార్వతీపురం, విజయనగరం, మధురవాడ, అనకాపల్లి, తగరపువలస (కొత్తది), అమలాపురం, రావులపాలెం, భీమవరం, ఏలూరు, గన్నవరం, మచిలీపట్నం, ఉయ్యూరు. తెనాలి, బాపట్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, మాచర్ల, మార్కాపురం, ఒంగోలు, కనిగిరి, కావలి, చిత్తూరు-2, కుప్పం, మదనపల్లి-2, రాయచోటి, ఆళ్లగడ్డ, కదిరి ఉన్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు, తాడిపత్రి డిపోలను 50 : 50 పద్ధతిలో నిర్వహించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది.








కామెంట్‌లు (0)