గెలుపే ధ్యేయంగా పనిచేయాలి
పార్టీ నేతలతో టిడిపి అధినేత చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక ఎన్నికల్లో బిసిలకు 40 శాతం వరకు సీట్లు ఇచ్చేలా కసరత్తు చేస్తామని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బిసిలకు 34 శాతానికి మించి స్థానాలు ఇస్తామని ప్రకటించామని తెలిపారు. బిసి నాయకత్వాన్ని పెంచడానికి స్థానిక సంస్థల ఎన్నికలే వేదిక అని అన్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ సిఫార్సులు ఆమోదించి వారికి వీలైనంత మేలు చేస్తున్నామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన ప్రచారం, కూటమి పార్టీలతో సమన్వయం వంటి అంశాలపై మంత్రులు, టిడిపి జిల్లా అధ్యక్షులు, ఎంపి, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు, నియోజకవర్గాల అబ్జర్వర్లు, పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు ఆదివారం వర్చువల్‌గా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘జయహో బిసి జనాభాలో సగం-కూటమి ఇచ్చింది బలం’ పేరుతో రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేపట్టాలన్నారు. స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుకు రేటింగ్స్ ఇస్తామని తెలిపారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుని కలిసి ప్రచారం చేయాలన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వైసిపి తప్పుడు ప్రచారం ముమ్మరం చేస్తోందన్నారు. 2024 ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఓట్లు పడాలని, నేతల పనితీరుకు ఇదే కొలమానం అని అన్నారు. 50 రోజులు ఎవ్వరికీ మినహాయింపు లేదని, గెలుపే ధ్యేయంగా పని చేయాలని చెప్పారు. సిన్సియార్టీ లేకుండా డ్రామాలాడేవారి వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదని, అలాంటి వారిని ఊపేక్షించబోమని హెచ్చరించారు. రూ.1.50 లక్షల కోట్లు సంక్షేమం కోసం ఖర్చు చేశామని, అంతే మొత్తంలో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామని,చెత్త పన్ను రద్దు చేసి చెత్తనూ తొలగించామని వెల్లడించారు. వికేంద్రీకరణ విధానంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న జగన్ తమపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అంతిమ లబ్ధిదారు జగన్ అయితే కత్తి తన చేతిలో పెట్టి ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కూటమి కొట్టే దెబ్బతో వైసిపి శాశ్వతంగా మూత పడుతుందన్నారు.








కామెంట్‌లు (0)