ఎపి గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అటవీ, వృక్ష సంపదను విస్తరించి 2047 నాటికి మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా బాధ్యతలు నిర్వర్తిస్తామని ఎపి గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కె నాగబాబు (కొణిదెల నాగేంద్ర రావు) తెలిపారు. పర్యావరణ పరిరక్షణను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజలందరూ భాగస్వామ్యమయ్యే మహోద్యమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. మంగళగిరి అరణ్యభవన్‌లో ఎపి గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 22.96 శాతంగా ఉందన్నారు. భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణం, మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. వాతావరణ మార్పులు ప్రపంచానికి సవాలుగా మారుతున్న ఈ సమయంలో పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి బాధ్యతగా పేర్కొన్నారు. అందుకే ఎపి గ్రీన్ కార్యక్రమాన్ని కేవలం అడవులకే పరిమితం చేయకుండా, రాష్ట్రంలోని ప్రతి అనుకూలమైన ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచేలా కార్యాచరణ చేపడుతున్నామన్నారు.
సిఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ
ఎపి గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబు.. ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎం క్యాంపు కార్యాలయంలో తన సతీమణితో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా నాగబాబును ముఖ్యమంత్రి సత్కరించి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా పనిచేయాలని శుభాకాంక్షలు తెలిపారు.








కామెంట్‌లు (0)