- నూతన వాహానాలను పరిశీలించిన సిఎం చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వం కొత్తగా 500 తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టనుంది. ఈ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్‌తో కలిసి ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, వారి నవజాత శిశువులు, సహాయకులను ఉచితంగా వారి ఇళ్లకు చేర్చడంతో పాటు అధిక ప్రమాద గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో బాధపడే గర్భిణులకు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రులకు వచ్చే గర్భిణులకు ఈ వాహనాలతో రవాణా సేవలు ప్రభుత్వం అందించనుంది. ప్రతి సంవత్సరం సుమారు 2.75 లక్షల మంది బాలింతలు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఈ కార్యక్రమం కోసం సిద్ధం చేసిన వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి–శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు, వాహనాలపై రూపొందించిన బ్రాండింగ్ నమూనాలను చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలించి కొత్త బ్రాండింగ్ డిజైన్లకు ఆమోదం తెలిపారు.
రియల్ టైమ్ పర్యవేక్షణకు జీపీఎస్ వ్యవస్థ
వాహనాల్లో తల్లీ–శిశువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా సౌకర్యాలను కల్పించారు. వెనుక సీట్లలో సీటు బెల్టులు, బాలింతలు సులభంగా ఎక్కేందుకు ఫుట్‌రెస్ట్, ఎయిర్ కండిషనింగ్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి వాహనంలో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా రియల్ టైమ్ పర్యవేక్షణకు అవకాశం కల్పించారు. వాహనాల పరిశీలన సందర్భంగా అధికారులు కార్యక్రమం అమలు విధానం, వాహనాల నిర్వహణ, రాష్ట్రవ్యాప్తంగా సేవల విస్తరణపై ముఖ్యమంత్రికి వివరించారు. వాహనాలపై అధికారిక స్టిక్కరింగ్ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీటి సేవలు అందించనున్నారు.








కామెంట్‌లు (0)