ఎపిఎస్ఆర్‌టిసి ఏర్పాట్లు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్‌టిసి) రాష్ట్ర వ్యాప్తంగా 5,261 ప్రత్యేక బస్సులను నడపడానికి ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.
దసరా ఉత్సవాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 16న మూల నక్షత్రం, 18న దుర్గాష్టమి, 19న మహర్నవమి, 20న విజయదశమి జరగనున్నాయి. ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ఈ నెల 16 నుంచి 19 వరకు ప్రీ-దసరా, అక్టోబరు 20 నుంచి 25 వరకు పోస్ట్ దసరా ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. హైదరాబాద్‌కు 1,186, విజయవాడకు 1,053, ఇతర ప్రాంతాలకు 1,360, బెంగళూరుకు 475, విశాఖపట్నానికి 440, రాజమండ్రికి 347, తిరుపతికి 247, చెన్నైకి 153 ప్రత్యేక బస్సులు కేటాయించారు. జిల్లాల వారీ అత్యధికంగా ఎన్‌టిఆర్ జిల్లాకు 804, విశాఖపట్నానికి 416, ఏలూరుకు 340, వైఎస్‌ఆర్ కడపకు 318, శ్రీకాకుళానికి 279, తూర్పుగోదావరికి 260, ప్రకాశం జిల్లాకు 245, కాకినాడకు 224 ప్రత్యేక బస్సులు కేటాయించారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైనచోట అదనపు బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు ఎపిఎస్ఆర్‌టిసి ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, అధికారులు తెలిపారు.








కామెంట్‌లు (0)