- అసోసియేషన్ సభ్యులతో మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత బలోపేతం చేసి, పౌల్ట్రీ రైతులకు అండగా నిలిచేందుకు ఏపీ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026–29కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పాలసీకి ఆమోదం తెలిపిన సందర్భంగా పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం విజయవాడలోని కార్యాలయంలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలసీని త్వరితగతిన అమల్లోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగానికి నూతన ఊతం అందించడంతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉత్పాదకతను పెంచడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పాలసీని రూపొందించినట్లు తెలిపారు. ఈ రంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.657 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని వివరించారు. పౌల్ట్రీ రైతుల విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు లో-టెన్షన్ కోళ్ల ఫారాలకు యూనిట్‌కు రూ.3.75, ఫీడ్ మిక్సింగ్ యూనిట్లకు యూనిట్‌కు రూ.4.75 చొప్పున టారిఫ్‌ను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. గ్రామీణ మహిళలకు ఉపాధి, అదనపు ఆదాయం కల్పించేందుకు బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా ఏటా 2,720 మదర్ పౌల్ట్రీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పౌల్ట్రీ రైతులు, పరిశ్రమ ప్రతినిధులు, సంబంధిత శాఖల సమన్వయంతో రాష్ట్ర పౌల్ట్రీ రంగాన్ని దేశంలోనే మరింత అభివృద్ధి చెందిన రంగంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
వైసిపి హయాంలో రైతులను గాలికొదిలేశారు
రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసిపికి లేదని ఒక ప్రకటనలో మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతుల పేరుతో ప్రచారం చేసుకోవడం తప్ప, పంటలకు ధరలు పడిపోయినప్పుడు వారికి అండగా నిలిచిన దాఖలాలు ఆ ప్రభుత్వానికి లేవు అని పేర్కొన్నారు. 2020లో మార్కెట్ ధర సుమారు రూ.12,000గా ఉన్నప్పటికీ కేవలం రూ.7,000 మద్దతు ధర ప్రకటించి, దానిని అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం రైతును ఆదుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేసిందని మంత్రి తెలిపారు. వివిధ పంటలకు మద్దతు ధరల కోసం సుమారు రూ.800 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.








కామెంట్‌లు (0)