- బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్థారించిన వైద్యులు
రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సినిమా చూసి మాల్ నుండి స్కూటీపై బయటకు వస్తున్న ఓ మెడికల్ విద్యార్థినిపై నిందితులు కారు ఎక్కించారు. ఈ ఘటనలో ఆమె బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 28 ఏళ్ల వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఈ నెల 3వ తేదీన రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్యా మాల్ లో సినిమా చూసి తర్వాత ఆమె స్కూటీపై ఇంటికి బయలుదేరారు. కారులో ఉన్న ఇద్దరు యువకులు వెనుక నుంచి వేగంగా వచ్చి ఆమె స్కూటీని ఢీకొన్నారు. డాక్టర్ ప్రియాంక రోడ్డుపై పడిపోగా, కారు ఆమె తలపై నుంచి ఎక్కించి వెళ్లిపోయారు . తీవ్ర తలగాయాలతో ఆమెను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆమె పరిస్థితి విషమించి బ్రెయిన్‌డెడ్‌గా మారినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటనపై ప్రకాశ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న నామవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.








కామెంట్‌లు (0)