మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం..
ప్రజాశక్తి-విజయవాడ: తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టీఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను వెంటనే రక్షించి, వారు పూర్తిగా కోలుకునే వరకు వైద్య సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని పారిశ్రామిక వాడలు, రసాయనిక పరిశ్రమలు, భారీ పరిశ్రమల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా వాటి నివారణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రమాదాలకు కార్మికులు, వారి కుటుంబాలు బలవుతున్నాయని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదం తర్వాత అన్ని పరిశ్రమల్లో సమగ్ర తనిఖీలు నిర్వహించి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. పేలుడు ప్రమాదం జరిగే అవకాశం ఉన్న అన్ని పరిశ్రమల్లో నిపుణులతో తనిఖీలు నిర్వహించి లోపాలను సరిచేయాలని కోరారు. టీఐఎల్ హెల్త్‌కేర్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రమాదానికి గురైన కార్మికులకు, వారి కుటుంబాలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సహాయం అందించాలని డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)