- జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు ఎంపి గురుమూర్తి లేఖ
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : రాష్ట్రంలో గురుకుల పాఠశాలల విలీనంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్కు తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, గౌరవం, వసతి సౌకర్యాల విషయంలో తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు. గురుకుల పాఠశాలలను విలీనంతో అక్కడ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని కోట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో 500 మంది, విజయనగరం గురుకులంలో 500 మంది, గుంటూరు తాడికొండ గురుకులంలో 500 మంది, విజయనగరం జిల్లాలోని మారికవలస ఎపిటిడబ్ల్యు రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 480 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు. గురుకులాల విలీనం కారణంగా విద్యార్థులకు సరిపడా వసతి సౌకర్యాలు లేక విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. కొన్ని చోట్ల గదుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను ఉంచుతున్నారని, మరికొన్ని సందర్భాల్లో విద్యార్థులు నేలపై నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు, తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా సరిగా లేవన్నారు. ఇలాంటి పరిస్థితులు విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత గోప్యత, భద్రత, గౌరవం, విద్యా వాతావరణంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. గురుకులాలను విలీనం చేసే ముందే అక్కడి వసతి సామర్థ్యం, విద్యార్థుల సంఖ్య, అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా అనే విషయాలను పరిశీలించాలని కోరారు. వీటిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, మానవ హక్కుల కమిషన్ వెంటనే క్షేత్రస్థాయి విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. గురుకుల పాఠశాలలు పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి కల్పించే ముఖ్యమైన విద్యాసంస్థలని, వాటి నిర్వహణలో విద్యార్థుల ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.








కామెంట్లు (0)