ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేసే జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వాలి

9 గంటల క్రితం

dyfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 06:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- డివైఎఫ్‌ఐ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో నిరుద్యోగులను ఊరించి, చివరకు అరకొర పోస్టులతో జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ విడుదల చేసి మోసం చేసిందని డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్న విమర్శించారు.తక్షణమే జాబ్‌ క్యాలెండర్‌ను సవరించి ఖాళీ పోస్టుల సంఖ్యను పెంచి, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ ‌చేశారు.మంత్రి లోకేష్‌ ప్రకటించిన మరో డిఎస్‌‌సిలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో స్పష్టత ఇవ్వకపోవడం నిరుద్యోగులను మరోసారి మోసం చేయడమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని కోరారు.ప్రస్తుత జాబ్‌ క్యాలెండర్‌లో కేవలం 10,060 పోస్టులు మాత్రమే ప్రకటించడం అన్యాయని తెలిపారు.పోలీస్‌ శాఖలో 19,996 కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 2,265 పోస్టులు భర్తీ చేయడం సరికాదని పేర్కొన్నారు.పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ అభ్యర్థులు కోరుతున్న 11,639 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరారు.ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ కలిపి 10 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు.గ్రూప్‌–1, 2లో 5 వేలకు పైగా ఖాళీలు ఉండగా కేవలం 800 పోస్టులు ప్రకటించడం తగదని హితవు పలికారు.లైబ్రేరియన్‌, పశుసంవర్ధక శాఖలోని యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు.దివ్యాంగులు, ఆదివాసీల కోసం తక్షణమే స్పెషల్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు.రెండు వేలకు పైగా ఖాళీగా ఉన్న ఎఇఇ పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారని, ఇలాంటి అరకొర జాబ్‌ క్యాలెండర్‌తో వారి జీవితాలతో చెలగాటమాడొద్దని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్