- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంపై రాష్ట్ర ఎంఎస్‌ఎంఈల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి చట్టపరమైన రక్షణ కల్పించడంతో పాటు వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, వ్యాపార నేరాలను తగ్గించడం, ఆలస్యమైన చెల్లింపుల సమస్యలకు పరిష్కారం చూపడం వంటి కీలక అంశాలకు ఈ బిల్లులో ప్రాధాన్యత ఇచ్చినట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బిల్లు ఆమోదం ఎంఎస్‌ఎంఈ రంగ చరిత్రలో ఇది కీలక పరిణామమని వెల్లడించారు. కొత్త చట్టం ద్వారా ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’ పోర్టల్‌కు ఉచిత, స్వచ్ఛంద డిజిటల్ వేదికగా శాశ్వత హోదా కల్పించడం స్వాగతించదగ్గ పరిణామమని తెలిపారు. సూక్ష్మ, చిన్న సంస్థలు తమ వివాదాలను తక్కువ ఖర్చుతో, సకాలంలో పరిష్కరించుకునేందుకు ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వివాద పరిష్కార దరఖాస్తులు న్యాయస్థానాల్లో ఆరు నెలలకు పైగా పెండింగ్‌లో ఉంటే, కొనుగోలుదారులు సరఫరాదారులకు కనీసం 50 శాతం మొత్తాన్ని చెల్లించేలా నిబంధన తీసుకురావడం ఎంఎస్‌ఈలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వ ప్రక్రియను 90 రోజుల్లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం కూడా సానుకూల పరిణామమన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎస్‌ఎంఈల నుంచి కొనుగోలు చేసే వస్తువులు, సేవలకు సంబంధించిన ఇన్వాయిస్‌ల సెటిల్‌మెంట్‌ను తప్పనిసరిగా ‘ట్రెడ్స్’ వేదిక ద్వారా నిర్వహించేలా నిబంధనలు తీసుకురావడం ఆలస్య చెల్లింపుల సమస్యను పరిష్కరించడంలో కీలకంగా మారుతుందని మంత్రి తెలిపారు. చెల్లింపుల వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి కంటే ఎక్కువ సూక్ష్మ, చిన్న సంస్థల సౌకర్య మండళ్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడం కూడా ఎంఎస్‌ఎంఈ రంగ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు.







కామెంట్‌లు (0)