- గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి - పార్వతీపురం : గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి టిడిపి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, డోలీ మోతలతో ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితికి శాశ్వతంగా ముగింపు పలుకుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. డిఎస్‌సి నియామకాలకు సంబంధించిన పూర్తి రికార్డులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నియామకాలు చేపట్టామని స్పష్టం చేశారు. ఐటిడిఎ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గతంలో ‘తల్లి బాట’ కార్యక్రమం ద్వారా రూ.1,065 కోట్లతో సుమారు 1,000 కిలోమీటర్ల తారు రోడ్లు నిర్మించామని, ప్రస్తుతం రెండో విడతలో రూ.2,600 కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ.900 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
గిరిజనులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇటీవల 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయగా, అందులో 2,200కు పైగా ఉద్యోగాలు గిరిజన యువతకు దక్కాయని తెలిపారు. జిఒ 3 విషయంలో గిరిజనులకు న్యాయం జరిగేలా న్యాయపరమైన మార్గాల్లో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. నేరేడి బ్యారేజ్, తోటపల్లి ప్రాజెక్టుల పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే విజయచంద్ర, ఐటిడిఎ పిఒలు వైశాలి, పవర్ స్వప్నల్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)