ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయాలి
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
పలు జిల్లాల్లో ర్యాలీలు
ప్రజాశక్తి - యంత్రాంగం : భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించుకోవడంతోపాటు, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సిపిఎం, సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ పరిరక్షణ వేదిక, పౌరహక్కుల సంఘం, సిపిఎం, సిపిఐ సంయుక్త ఆధ్వర్యం లో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిజ్ఞలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓటు హక్కును హరించే ఎస్‌ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ నగరంలోని ద్వారకానగర్ గురజాడ అప్పారావు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జెవి సత్యనారాయణమూర్తి, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడారు. రాజ్యాంగం, దేశ ప్రజల పట్ల మోడీ ప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవమున్నా తక్షణమే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.
నెల్లూరులోని విఆర్‌సి సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసేందుకు 'వాక్ టువర్డ్స్ కాన్స్టిట్యూషన్' పేరుతో నడక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మేలుకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-కన్వీనర్ షేక్ అబ్దుల్ సుభాన్, సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ ఆరు రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ప్రకారం ఐదు కోట్ల తొమ్మిది లక్షల ఓట్లు తొలగించినట్లు వెల్లడైందని పేర్కొన్నారు.
తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీరోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించారు. వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున రాజ్యాంగ పీఠికను విద్యార్థులతో చదివించి, అందులోని ప్రధాన అంశాలను వివరించి ప్రతిజ్ఞ చేయించారు.
తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, డిఆర్ఒ జి నరసింహులు కలిసి కలెక్టరేట్ సిబ్బందితో భారత రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు.
ఎపిలో పత్రికా స్వేచ్ఛ పతనమవుతోందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. యాజమాన్యాలు జర్నలిస్టుల అధికారాలను హరిస్తున్నారని విమర్శించారు. చిత్తూరు అర్బన్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు.
విజయనగరం టౌన్ బాలాజీ జంక్షన్, అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగం పరిరక్షణ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఐ జిల్లా సమితి సభ్యులు నాగభూషన్ మాట్లాడారు.








కామెంట్‌లు (0)