ప్రజాశక్తి-విజయవాడ : జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వందలాది మంది పాఠశాల విద్యార్థులు, విద్యార్థినీ విద్యార్థులు, యువత, కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గురజాడ అప్పారావు రచించిన “దేశమును ప్రేమించుమన్నా… మంచి అన్నది పెంచుమన్నా…” అనే మహోన్నత దేశభక్తి గీతాన్ని ఘంటసాల సంగీత కళాశాల వేదికపై సమూహగానంగా ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా ఉమామహేశ్వరం పాత్రుల బృందం ఆధ్వర్యంలో పిల్లలు ప్రదర్శించిన “పుత్తడి పూర్ణమ్మ” రూపకం అద్భుతంగా సాగింది. పిల్లలు ఎంతో సృజనాత్మకతతో, కళాత్మకతతో రూపకాన్ని రూపొందించి ప్రదర్శించడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం – పాటల బడికి చెందిన డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, ఇతర ప్రముఖులు కలిసి దేశభక్తి గీతాన్ని శాస్త్రీయ గాన పద్ధతిలో శ్రావ్యంగా ఆలపించారు. పెద్దల గానం పిల్లలకు స్ఫూర్తినిస్తూ, వారిలో దేశభక్తి భావాన్ని మరింత పెంపొందించింది. వెయ్యి గళాలు ఒక్కటై… ఒకే గొంతుతో దేశాన్ని ప్రేమించమని… మంచిని పెంచమని పిలుపునిచ్చాయి. గురజాడ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమం కళ, సాహిత్యం, సంగీతం, దేశభక్తి, పిల్లల సృజనాత్మకతను ఒకే వేదికపై కలిపిన స్ఫూర్తిదాయకమైన వేడుకగా నిలిచింది.
గురజాడ జయంతి సందర్భంగా 'వెయ్యి గళాలు ఒక్కటైన వేడుక'
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 05:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)