శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionహక్కుల సాధనకు ఐక్యపోరాటమే మార్గం

4 గంటల క్రితం

హక్కుల సాధనకు ఐక్యపోరాటమే మార్గం
- సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి నాగేశ్వరరావు
- పారామెడికల్ సిబ్బంది ఉద్యమానికి మద్దతు
- మార్కాపురం జిల్లాలో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 11:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి నాగేశ్వరరావు

  • పారామెడికల్ సిబ్బంది ఉద్యమానికి మద్దతు

  • మార్కాపురం జిల్లాలో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి, పల్నాడు జిల్లా : హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి ఐక్యపోరాటాలే మార్గమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి నాగేశ్వరరావు తెలిపారు. కాంట్రాక్టు ఆరోగ్య సిబ్బంది న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటాన్ని ఐక్యంగా కొనసాగించాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జిజిహెచ్ వద్ద పారామెడికల్ ఉద్యోగుల నిరసన శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ... విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న సిబ్బందిని కలిసి వారి సమస్యలను తెలుసుకున్నామని తెలిపారు. స్టాఫ్ నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది ప్రజలకు సేవలందిస్తూనే హక్కుల కోసం సంఘటితంగా ఉద్యమిస్తున్నారని వివరించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కాంట్రాక్టు సిబ్బందికి తగిన గుర్తింపు, భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వీరిని రెగ్యులరైజ్‌ చేయాలని, అప్పటివరకు గ్రాస్‌ శాలరీ చెల్లించాలని, విధుల్లో ఉండగా మరణిస్తే రూ.50 లక్షల పరిహారం అందించాలని, పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం, ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ బెదిరించడం వంటి చర్యలను అధికారులు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా నాయకులు రామచంద్రరావు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగి ఆత్మహత్యాయత్నం...

ఉద్యోగం ఉందనే ధీమాతో ఆరు నెలల కిందటే పెళ్లి చేసుకున్న వైద్యారోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగి తాజా పరిస్థితులతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నం చేశారు. మార్కాపురం జిల్లాలోని గుట్ల ఉమ్మడి వరం గ్రామానికి చెందిన కోటయ్య పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలో స్టాఫ్‌‌నర్సుగా పని చేస్తున్నారు. ఆరు నెలల కిందటే వివాహమైంది. ఈ క్రమంలో తమను పర్మినెంట్‌ ‌చేయడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు నాలుగు రోజులుగా సమ్మె చేపట్టారు. సమ్మెలో గాదె కోటయ్య కూడా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా గురువారం నరసరావుపేటలో సమ్మె శిబిరానికి హాజరైన ఆయన సాయంత్రం ఇంటికెళ్లాడు. మరోవైపు పదిమంది ఉద్యోగులకు షోకాజులు జారీ కావడంతో ఆందోళనకు గురైన కోటయ్య అదేరోజు రాత్రి ఇంటి వద్దే గడ్డి మందు తాగారు. శుక్రవారం ఉదయాన్నే అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను గమనించిన కుటుంబీకులు స్థానిక ఆస్పత్రికి, అనంతరం పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ఆస్పత్రికి, అనంతరం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మరో ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనను సిఐటియు, వివిధ సంఘాల నాయకులు పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కోటయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని, బాధితుడికి మెరుగైన వైద్యం అందించి, వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వం మొండివైఖరి విడనాడి ఉద్యోగ భద్రత, ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. పరామర్శించిన వారిలో సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయులు నాయక్‌, రైతుసంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జెఎసి చైర్మన్ బి.నాగరాజు కుమారి, జిల్లా కన్వీనర్ కె.శాంతరాజు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్