శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతక్షణమే రైలు, మెట్రో స్టేషన్లు తెరవాలి

2 గంటల క్రితం

Untitled-design-2026-10-09T165441.584.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 12:04 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

  • సామాన్యులను పట్టించుకోండి

  • నిరసనలపై ఆంక్షలు నిషేధంతో సమానమన్న ధర్మాసనం

  • ఈగను చంపడానికి సమ్మెట వాడలేమంటూ చీఫ్‌ జస్టిస్‌‌ వ్యాఖ్యలు

  • సిపిఎం నేత ఎం.ఎ బేబీ పిటిష‌న్‌పై సుప్రీం అత్యవసర విచారణ

​ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి), ప్రతిపక్షాలు, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్‌, ఎఐఎస్ఎ వంటి విద్యార్థి, డివైఎఫ్ఐ, ఎఐవైఎఫ్ వంటి యువజన సంఘాలు తలపెట్టిన ఆందోళనను అణచివేసేందుకు ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిరసనకారులను అడ్డుకునేందుకు 57 మెట్రో స్టేషన్లతోపాటు న్యూఢిల్లీ, నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్లను పూర్తిగా మూసి వేయడాన్ని అంగీకరించేది లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్ప‌ష్టం చేసింది. రైల్వేస్టేషన్లను, మెట్రో స్టేషన్లను వెంటనే తెరవాలని ఆదేశించింది. స్టేషన్లను పూర్తిగా మూసివేయడం నిషేధంతో సమానమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రైళ్ల రద్దు, రోడ్డు రవాణాపై విధించిన ఆంక్షలను పునఃపరిశీలించాలని ఆదేశించింది. జంతర్‌మంతర్‌కు బదులుగా మరో నిరసన ప్రదేశాన్ని కేటాయించే అంశంపైనా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ప్రత్యామ్నాయ నిరసన వేదిక కోసం నిర్వాహకులు కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. శనివారం నాటి నిరసన నేపథ్యంలో కేంద్రం దేశ రాజధానిలో అత్యంత అప్రజాస్వామికంగా విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ తదితరులు దాఖలు చేసిన పిటిష‌న్‌ను శుక్రవారం అత్యవసరంగా విచారించిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్‌ నిలిపివేత సహా ఇతర ఆంక్షలను పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు హామీ ఇచ్చారు.

​సామాన్యులు ఎందుకు ఇబ్బంది పడాలి?

​శుక్రవారం రాత్రి 9 గంటల నుంచే కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేయడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రతి ఒక్కరికీ సొంత కార్లు ఉండవని, కేవలం ప్రజా రవాణాపై ఆధారపడే పౌరులను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. ఈగను చంపడానికి సమ్మెట ఉపయోగించలేమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. నిరసనలను నియంత్రించే పేరుతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గురుగ్రామ్‌, గ్రేటర్‌ నొయిడా, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం నగరానికి వచ్చే వేలాది మంది సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ, వారి పట్ల తమకు ఆందోళన వుందని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ అన్నారు. ‘ మా ఆందోళన జీవనోపాధుల కోసం వందలు వేల సంఖ్యలో నగరానికి రోజూ వచ్చే సాధారణ ప్రజల ప్రయోజనాల కోసమే’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘వీరిలో విద్యార్ధులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ వుంటారు. వారి తరపునే మాట్లాడుతున్నాం. శాంతిభద్రతల అధికారులు ప్రతీ ఒక్కదాన్ని నిలిపివేసి, సామాన్యుడికి ఎలాంటి రవాణా సదుపాయం లేకుండా చేయరాదు.’’ అని పేర్కొన్నారు.

​ప్రజా రవాణాను నిలిపివేయడం తగదు

​సిపిఎం నేత ఎం.ఎ బేబీ తరపున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ.. తెల్లవారుజామున 4గంటల నుండి మధ్యాహ్నం 2గంటల మధ్యలో న్యూఢిల్లీ, నిజాముద్దీన్‌ ‌రైల్వే స్టేషన్లకు చేరుకునే రైళ్లన్నింటినీ నిలిపివేశారని చెప్పారు. కేరళం త‌దిత‌ర దూరప్రాంత రైళ్లు ఉదయం 11 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకుంటాయని, అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైల్వే స్టేషన్లు, మెట్రో సేవలపై ఆంక్షలు విధించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు. రామ్‌లీలా మైదాన్‌ను కూడా నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొల‌గించార‌ని క‌పిల్ సిబ‌ల్ తెలిపారు. జంత‌ర్ మంత‌ర్ ఒక నిర్దేశిత నిర‌స‌న ప్ర‌దేశ‌మ‌ని అక్కడ నిరసనలకు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించిన‌ప్పుడు, రామ్‌లీలా మైదాన్‌లో ప్ర‌త్యామ్నాయం ఎందుకు ఇవ్వ‌లేద‌ని సీనియ‌ర్ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌న్ ప్రశ్నించారు. న్యాయ‌వాదుల వ‌ద్ద కార్లు ఉన్నందున‌, రాక‌పోక‌ల ఆంక్ష‌ల‌తో వారికి స‌మ‌స్య ఉండ‌క‌పోవ‌చ్చ‌ని సిజెఐ చేసిన వ్యాఖ్య‌ల‌పై సీనియ‌ర్ న్యాయ‌వాది ఎన్‌.హ‌రిహ‌ర‌న్ స్పందించారు. అంతా బారికేడ్ల‌తో మూసివేశార‌ని, కార్లు న‌డ‌ప‌డానికి రోడ్డు ఎక్క‌డ ఉంద‌ని అన్నారు.

​శాంతి భద్రతల పేరుతో మూసివేయడం సరికాదు

​శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఆంక్షలు విధించామని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఆ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. దానిపై ‌సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతాను ఉద్దేశించి చీఫ్‌ ‌జస్టిస్‌ మాట్లాడుతూ, ‘శాంతి భద్రతల బాధ్యత మీదే కావచ్చు, కానీ ఆ కారణంగా మీరు ఈ చర్యలన్నీ తీసుకోలేరు, పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించేలా మీ వైఖరి వుండాలని’ సూచించారు. నిరసనలను అడ్డుకునేందుకు అన్ని మార్గాలను మూసివేయడం పరిష్కారం కాదని బెంచ్‌ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాపాడటంతోపాటు సామాన్యుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ‌వుండేలా ఆంక్షలు వుండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరసనల్లో పాల్గొనకుండా వెనక్కి తగ్గాలని కోరుతూ మసీదులకు పోలీసులు వెళ్లిన ఘటనలపైనా తర్వాత పరిశీలన జరుపుతామని ధర్మాసనం తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్