శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఖరీఫ్‌కు సమృద్ధిగా ఎరువుల నిల్వలు

1 గంట క్రితం

atchanna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 09:21 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- మంత్రి అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా, డిఎపితో పాటు అన్ని రకాల ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జూలై 10వ తేదీకి రాష్ట్రంలో 3.70 లక్షల టన్నుల యూరియా, 90 వేల టన్నుల డిఎపి నిల్వలు ఉన్నాయని మంత్రి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా మార్క్‌ఫెడ్ గోదాముల్లో తగిన బఫర్ స్టాక్‌ను నిల్వ ఉంచామని తెలిపారు. ఎక్కడైనా నిల్వలు తగ్గిన వెంటనే అదనపు ఎరువులను తరలించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వివిధ కంపెనీల నుంచి ఎరువుల నిల్వలను ప్రభుత్వ గోదాములకు తరలించి భద్రపరుస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,69,646 టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, ఇది ఖరీఫ్ అవసరాల్లో 85 శాతం మేరకు సరిపోతుందని తెలిపారు. అలాగే 85,683 టన్నుల డిఎపి నిల్వలు ఉండగా, ఇది ప్రస్తుత సీజన్ అవసరాల్లో 64 శాతం మేర అందుబాటులో ఉందన్నారు. అవసరానికి అనుగుణంగా అదనపు ర్యాకులు రాష్ట్రానికి చేరుతున్నాయని, జిల్లాల వారీగా నిల్వలు, వినియోగాన్ని ప్రతిరోజూ సమీక్షిస్తూ సరఫరాను కొనసాగిస్తున్నామని చెప్పారు.

సంకిలి ఘటనపై స్పందించిన మంత్రి

విజయనగరం జిల్లా ఆర్. అముదాలవలస మండలం సంకిలి రైతు సేవా కేంద్రంలో జరిగిన ఘటనపై మంత్రి స్పందించారు. సంకిలి ఆర్‌ఎస్‌కే పరిధిలో తొలి విడత అవసరంగా 811 బస్తాల యూరియా అవసరమని గుర్తించామని, ఇప్పటికే బొడ్డవలస, అప్పాపురం గ్రామాలకు 225 బస్తాలు పంపిణీ చేశామని తెలిపారు.

మిగిలిన గ్రామాలకు యూరియా పంపిణీ సందర్భంగా రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో అదనపు డిమాండ్ ఏర్పడిందని, వెంటనే సమీప రైతు సేవా కేంద్రం నుంచి 444 బస్తాల యూరియాను తెప్పించి అదే రోజు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. గ్రామ పెద్దలతో సమావేశమై టోకెన్ విధానం, క్యూలైన్ వ్యవస్థ ద్వారా పంపిణీ కొనసాగిస్తున్నామని వివరించారు. విజయనగరం జిల్లాలో ప్రస్తుతం 9,987 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉండగా, అందులో 4,850 మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్ బఫర్ స్టాక్‌గా ఉన్నాయని మంత్రి తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్