భారీ మొత్తంలో నగలు, ఆస్తులు గుర్తింపు!
ప్రజాశక్తి - తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంతోపాటు ఏకకాలంలో ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీ చేశారు. తిరుమలలోని బి-టైప్ క్వార్టర్స్‌లో ఉంటున్న లోకనాథం నివాసానికి ఎసిబి అధికారులు బుధవారం ఉదయం ఆరు గంటలకు చేరుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసంతోపాటు క్యాంపు కార్యాలయం, తిరుపతి పెద్దకాపు వీధిలోని నివాసం, తిరుపతిలోని లోకనాథం ఇద్దరు బావమరుదుల ఇళ్లు, ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి నివాసంతోపాటు మరో ప్రాంతంలోనూ సోదాలు నిర్వహించారు. తిరుపతి ఎస్‌టివి నగర్ ఎస్‌బిఐ బ్రాంచ్ లాకర్లను పరిశీలించారు. ఎసిబి డిఎస్‌పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, స్థిర, చరాస్తులు గుర్తించినట్లు సమాచారం. లోకనాథం విధులకు సంబంధించిన వ్యవహారాలు, ఆదాయానికి మించిన ఆస్తులు, ఇతర అక్రమాలపై ఎసిబి అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సోదాలు పూరైన తర్వాత పూర్తి వివరాలు వెళ్లడిస్తామని డిఎస్‌పి తెలిపారు. 2011లో అప్పటి టిటిడి డిప్యూటీ ఇఒ భూపతిరెడ్డి నివాసంలో ఎసిబి సోదాలు నిర్వహించింది. సుమారు 15 ఏళ్ల తర్వాత తిరిగి అదే స్థాయి అధికారి నివాసంలో తనిఖీలు చేయడం తీవ్ర కలకలం రేపింది.








కామెంట్‌లు (0)