- జలపాత స్నానం తర్వాత నలుగురు పిల్లలు మృతి
- ఒకే కుటుంబానికి చెందినవారే
శివపురి: మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జలపాతంలో స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురైన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బాలురు 10 రోజుల వ్యవధిలో మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు సోదరులు కాగా, నాలుగో బాలుడు వారి బంధువు కుమారుడిగా అధికారులు తెలిపారు. ఆగస్టు 16న తన్వీర్ అహ్మద్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మొత్తం 16 మందితో జలపాతానికి వెళ్లారు. అక్కడ స్నానం చేసి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబంలోని పలువురు సభ్యులకు జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య లక్షణాలు కనిపించాయి.
మొదట 14 ఏళ్ల బాలుడి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. అనంతరం 19 ఏళ్ల అయాజ్‌తో పాటు మరికొందరు పిల్లలు కూడా అనారోగ్యానికి గురయ్యారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ నలుగురు పిల్లల ప్రాణాలను కాపాడలేకపోయారు.
ఈ ఘటనపై ఆరోగ్య శాఖ, జిల్లా యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించాయి. జలపాతానికి వెళ్లిన 62 మంది నుంచి వైద్య నమూనాలను సేకరించినట్లు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ దినేష్ చంద్ శుక్లా తెలిపారు. జలపాతం నుంచి నీటి నమూనాలను కూడా సేకరించి పరీక్షలకు పంపించారు.
నమూనాలు సేకరిస్తున్న సమయంలో మరో ముగ్గురు బాలికలు అస్వస్థతకు గురికావడంతో వారిని మెరుగైన చికిత్స కోసం గ్వాలియర్‌కు తరలించారు. మృతులకు అందించిన వైద్య చికిత్స, అనారోగ్యానికి గురైన వారికి కనిపించిన లక్షణాలు, ఇన్ఫెక్షన్‌కు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే నలుగురు పిల్లల మరణాలకు జలపాతం నీరే కారణమని ఆరోగ్య శాఖ ఇప్పటివరకు ధృవీకరించలేదు. నీటి నమూనాలు, వైద్య పరీక్షల ఫలితాలు, దర్యాప్తు నివేదికలు వచ్చిన తర్వాతే అనారోగ్యానికి, వరుస మరణాలకు అసలు కారణం ఏమిటనేది స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.







కామెంట్‌లు (0)