ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రమాదం

1 రోజు క్రితం

అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రమాదం 
 - బ్రేకులు ఫెయిలై బస్సు బోల్తా
- నలుగురు మృతి.. 32 మందికి గాయాలు
  ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 09:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- బ్రేకులు ఫెయిలై బస్సు బోల్తా

- నలుగురు మృతి.. 32 మందికి గాయాలు

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ర్టం వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్‌రోడ్డులో శనివారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిలై బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా వారి బంధువుల అంత్యక్రియల కోసం వికారాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో అనంతగిరి ఘాట్‌ రోడ్డులో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల వివరాల మేరకు... వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి శుక్రవారం ఇస్నాపూర్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం కేసారం గ్రామానికి చెందిన మంజుల కుటుంబానికి నారాయణరెడ్డి ఆడబిడ్డ తరపు బంధువు కావడంతో, ఆ కుటుంబ సభ్యులంతా కలిసి ఒక ప్రైవేట్ బస్సులో అంత్యక్రియల కోసం బయలుదేరారు. అనంతగిరి ఘాట్ రోడ్‌ మూలమలుపులో నంది విగ్రహం దగ్గర బస్సు బ్రేకులు ఫెయిలైన విషయాన్ని గమనించిన డ్రైవర్ వాసు బస్సులో ఉన్న అందరికీ తెలిపాడు. ప్రయాణికులంతా భయంతో కేకలు వేయగా అంతలోనే మూలమలుపు దాటిన వెంటనే బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు బస్సు అద్దాలను పగలగొట్టి బస్సులో ఉన్న వారిని బయటికి తీశారు. బస్సు ఒక్క వైపునకు ఒరిగి పడటంతో ఒకరి మీద ఒకరు పడి వయస్సు పైబడిన వృద్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారందరినీ స్థానిక ఆస్పత్రులకు తరలించగా అక్కడ పరిస్థితి విషమించి మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కేసారం గ్రామానికి చెందిన ఎ. యాదమ్మ, అత్తేల్లి పద్మమ్మ, మాల పద్మమ్మ, శంకర్ పల్లి మండలం సింగపురం గ్రామానికి చెందిన ఆర్. ప్రమీల ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదంపై సిఎం రేవంత్‌ ‌రెడ్డి, వికారాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్టు మంత్రి వెల్లడించారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్