శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దేవి కొండ అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలి

1 గంట క్రితం

మైనింగ్‌
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 09:24 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రజా సంఘాల డిమాండ్‌

ప్రజాశక్తి-పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం దేశపాత్రునిపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 334లో ఉన్న దేవి కొండలో అక్రమంగా తవ్వకాలు జరిపి విలువైన ఎర్రమట్టిని తరలిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. దేవి కొండలో అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని సిఐటియు జిల్లా నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, సిపిఎం జిల్లా నాయకులు, దేశపాత్రునిపాలెం మాజీ ఉపసర్పంచ్‌ వి.వి.రమణ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. సుమారు రూ.50 కోట్ల విలువైన ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నప్పటికీ మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించేలా భారీగా ఎర్రమట్టిని తరలించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కొందరు కూటమి నాయకుల అండతోనే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రజల్లో ఉన్నాయని, ఈ అంశంపైనా విచారణ జరపాలని కోరారు. దేశపాత్రునిపాలెం గ్రామాన్ని ఫార్మా పరిశ్రమల కాలుష్యం నుంచి దేవి కొండ రక్షణ గోడలా కాపాడుతోందని నాయకులు పేర్కొన్నారు. కొండ పూర్తిగా ధ్వంసమైతే భవిష్యత్తులో గ్రామ ప్రజలు తీవ్ర కాలుష్య సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు. మైనింగ్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇంత భారీగా ఎర్రమట్టి ఎలా తరలించారని ప్రశ్నించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం చేశారా, లేక మైనింగ్‌ మాఫియాతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ జరపాలని కోరారు. గతంలో దేవి కొండలో మట్టి తవ్వకాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని వారు గుర్తుచేశారు. అక్రమ మైనింగ్‌పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సీఐటీయూ, సీపీఎం నాయకులు తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజా పోరాటం చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్