ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెనాలి ఘటనకు సంబంధించి న్యాయపరమైన పరిణామాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో బాధ్యులైన పోలీసు అధికారులపై సమగ్ర దర్యాప్తు జరిపి, నేరం రుజువైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. తెనాలిలో దళిత, మైనార్టీ యువకులను అక్రమంగా నిర్బంధించి, తప్పుడు కేసులు నమోదు చేసి, బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలపై కెవిపిఎస్ మొదటి నుంచీ ఆందోళన చేస్తోందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఘటనకు సంబంధించి బాధ్యులైన తెనాలి 2 టౌన్ సీఐతో పాటు సంబంధిత పోలీసు సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అక్రమ నిర్బంధం, తప్పుడు కేసులు, చిత్రహింసలు వంటి ఆరోపణలు రుజువైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెనాలి, తాడికొండ, మంగళగిరి రూరల్ ఘటనలతో పాటు దళితులు, మైనార్టీలు, బలహీన వర్గాలపై పోలీసుల అక్రమ నిర్బంధాలు, చిత్రహింసలు, లాకప్ డెత్‌లపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. బాధితుల, వారి కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందినవారైతే నేర స్వభావాన్ని బట్టి ఎస్‌సి,ఎస్‌టి అట్రాసిటీ నిరోధక చట్టంలో వర్తించే నిబంధనలను అమలు చేయాలని కోరారు. పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు తావులేకుండా కఠిన మార్గదర్శకాలు అమలు చేసి, వాటిని ఉల్లంఘించే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే పోలీసుల అక్రమ అరెస్టులు, థర్డ్ డిగ్రీ హింస, లాకప్ డెత్‌లకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Print Editionతెనాలి ఘటనపై చర్యలు తీసుకోవాలి : కెవిపిఎస్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026, 10:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)