ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శ్రీకాకుళం జిల్లాలోని పున్నం మాంగనీస్ బ్లాక్‌ను వేదాంత లిమిటెడ్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గనులు, భూగర్భవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 152 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న పున్నం మాంగనీస్ బ్లాక్‌కు వేదాంత లిమిటెడ్‌కు కాంపోజిట్ లైసెన్స్ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 16న నిర్వహించిన ఈ వేలంలో వేదాంత లిమిటెడ్ ప్రాధాన్య బిడ్డర్‌గా నిలిచిందని, ఖనిజాన్ని రవాణా చేసే విలువపై 20.10 శాతం హెచ్1 రేటును వేదాంత సంస్థ నమోదు చేసిందని వెల్లడించారు. మొత్తం 152 హెక్టార్లలో 12.08 హెక్టార్లు ప్రభుత్వ భూమి, 139.91 హెక్టార్లు పట్టా భూమిగా ఉంది. ప్రభుత్వ భూమికి సంబంధించి తహసీల్దార్ ఎన్‌ఓసీ జారీ చేశారని, అయితే పట్టా భూముల్లో అన్వేషణ కార్యకలాపాలు చేపట్టే ముందు సంబంధిత భూ యజమానుల అనుమతి తప్పనిసరిగా పొందాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూయజమానుల అంగీకారంతోనే అన్వేషణ పనులు చేపట్టి, వర్తించే చట్టాల ప్రకారం పరిహారం చెల్లిస్తామని వేదాంత లిమిటెడ్ అఫిడవిట్‌లో పేర్కొందని తెలిపింది. భౌగోళిక సర్వేలు, బోర్‌హోల్ డ్రిల్లింగ్, స్కౌట్ హోల్స్, పిట్టింగ్, ట్రెంచింగ్ తదితర అన్వేషణ కార్యకలాపాలు చేపట్టేందుకు ఈ కాంపోజిట్ లైసెన్స్ అవకాశం కల్పిస్తుంది. పున్నం బ్లాక్ ప్రస్తుతం ప్రారంభ దశలోని జి4 అన్వేషణ స్థాయిలో ఉంది. మినరల్ ఆక్షన్ రూల్స్ ప్రకారం లైసెన్స్ మంజూరు చేసిన ప్రభుత్వం, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు, అనుమతులు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. అన్ని నిబంధనలు, షరతులు నెరవేరినట్లు నిర్ధారించుకున్న అనంతరం తదుపరి చర్యలు చేపట్టాలని గనులు, భూగర్భశాస్త్ర శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
Print Editionవేదాంతకు పున్నం మాంగనీస్ బ్లాక్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 11:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)