శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళా ఉద్యమ నేత మానికొండ సూర్యావతికి ఐద్వా నివాళి

1 గంట క్రితం

AIDWA pays tribute to women's movement leader Manikonda Suryavathi.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 04:39 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ఎస్ పుణ్యవతి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ నాయకురాలు

  • ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా మానికొండ సూర్యావతి 33 వ వర్ధంతి


ప్రజాశక్తి- తాడేపల్లి రూరల్ (గుంటూరు) : కేంద్ర ప్రభుత్వం 2023 లో చేసిన చట్టం ప్రకారమే మహిళా రిజర్వేషన్ 33 శాతం అమలు చేయాలని ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్.పుణ్యవతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, కొలనుకొండ జాతీయ రహదారి వద్ద ఉన్న ఐద్వా రాష్ట్ర కార్యాలయంలోని కామ్రేడ్ మానికొండ సూర్యవతి 33వ వర్ధంతి కార్యక్రమం ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి.ప్రభావతి అధ్యక్షతన శనివారం జరిగింది. ముందుగా సూర్యవతి చిత్రపటానికి ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్ పుణ్యవతి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ .... మహిళా ఉద్యమ నేతగా, మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పైన సూర్యవతి ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. 15 సంవత్సరాల వయసులోనే ఉద్యమ బాట పట్టిన సూర్యవతి అరెస్టులు, జైళ్లను సైతం లెక్కచేయకుండా పోరాట పటిమతో, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మహిళా ఉద్యమ నిర్మాతలలో ఒకరిగా, ఆంధ్ర రాష్ట్ర మహిళా ప్రధమ మహాసభకు కార్యదర్శిగాను, కృష్ణా జిల్లాలోని నందమూరు సర్పంచ్ గాను,1992-93 లో ఉంగుటూరు మండల అధ్యక్షురాలుగా స్థానికంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై, మహిళ ప్రజాప్రతినిధిగా పనిచేసి చరిత్ర సృష్టించారని వివరించారు. తాను పనిచేసిన ప్రాంతాలలో మహిళలకు మరుగుదొడ్లు కావాలని నిర్మించిన ఘనత సూర్యవతికి దక్కుతుందన్నారు. వరదలు, తుఫాన్లు సంభవించినప్పుడు రైతులకు అండదండగా నిలిచారన్నారు. నేడు మహిళా లోకం పంచాయతీ ఎన్నికలలోనే కాకుండా అసెంబ్లీ, పార్లమెంటులలో కూడా 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని పోరాడుతుందని అన్నారు. 1996లో మహిళా పార్లమెంట్, వామపక్ష నాయకురాలు గీతా ముఖర్జీ నాయకత్వన మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కావాలని జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కమిటీ పార్లమెంటుకు రిపోర్ట్ ఇచ్చిన ఇప్పటికీ రిజర్వేషన్ బిల్లు అమలుకు నోచుకోలేదన్నారు. 2010లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తామని చెప్పి చేయలేదన్నారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం 33 శాతం బిల్లు లోక్ సభలో పెట్టి, అమలు చేసేందుకు పూనుకోలేదని ఆమె విమర్శించారు. రాజకీయ ఎత్తుగడలు, ప్రయోజనాలు తప్ప మహిళా రిజర్వేషన్ బిల్లు బిజెపి ప్రభుత్వానికి పట్టదని ఆమె ఎద్దేవా చేశారు. 2023 లో లోక్ సభలో మహిళా బిల్లు పెట్టి, 2011 జనాభా లెక్కల ప్రకారం... జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ పేరుతో లింకులు పెట్టారని అన్నారు. లింకులు, ఫిట్టింగులు పెట్టకుండా 2023లో చేసిన చట్టం ప్రకారం 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ఇటీవల 2026 లో డిలిమిటేషన్ కమిషన్ తో నిమిత్తం లేకుండా పార్లమెంటులో సీట్లు పెంచుతామని నరేంద్ర మోడీ చెప్పడం మహిళలను మోసం చేయడమే అవుతుందని దుయ్యబట్టారు. ఏ ప్రాతిపదికన సీట్లు పెంచుతారో మోడీ సమాధానం చెప్పాలని పుణ్యవతి ప్రశ్నించారు. ప్రతిపక్షాల కారణంగానే పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోయిందని మోడీ చెప్పడం దుర్మార్గమన్నారు. అసలు మహిళా బిల్లు అమలు చేస్తారా ? లేదా ! అని మోడీ ప్రభుత్వాన్ని పుణ్యవతి ప్రశ్నించారు. రాజ్యాంగం వద్దని, మనుధర్మం అమలు చేసేందుకు, స్త్రీ హక్కులు కాలరాసేందుకే మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నారి శక్తి అని చెప్పే మోడీ ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి వీడి, 2023లో చేసిన చట్టం ప్రకారం 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి మాట్లాడుతూ .... కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల ప్రాతిపదికన కాకుండా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్ బిల్లు అమలు చేసేది తామే అని నమ్మ పలుకుతుందని అన్నారు. 33 శాతం బిల్లును కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ప్రశ్నిస్తుందన్నారు. శీతాకాలపు పార్లమెంటు సమావేశాలలో మహిళా బిల్లు ఆమోదించి, అమలు చేయకుంటే దేశవ్యాప్తంగా మహిళా సంఘం పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేసి, ఉద్యమం చేపడతామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి ప్రభావతి, సత్యవతి, మస్తాన్ బి, శ్యామల, రమణ, పూర్ణ, డి శ్రీనివాస్ కుమారి, కంకణాల రమ, అరుణ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్