ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారి విస్తరణకు మంగళగిరి ఎయిమ్స్ పరిధిలోని 3.34 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో మీడియాకు శనివారం తెలిపారు. ఎయిమ్స్ భూమిని జాతీయ రహదారికి కేటాయించడం వల్ల ప్రత్యామ్నాయంగా మరో పది ఎకరాలు ఎయిమ్స్‌కు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పది ఎకరాల భూమి అప్పగింత పూర్తయిన వెంటనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమాచారం అందించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. మంగళగిరి వద్ద జాతీయ రహదారి విస్తరణ కారిడార్ నిర్మాణానికి అవసరమైన భూ సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని, ఈ నిర్ణయం మంగళగిరి - గుంటూరు ప్రాంతాల్లో రహదారి కనెక్టివిటీని మెరుగుపరిచే దిశగా కీలక ముందడుగు అని పేర్కొన్నారు.
మంగళగిరికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సుమారు 183 ఎకరాల భూమిలో ఇంకా పెండింగ్‌లో ఉన్న ఆరు ఎకరాల భూమి డీమార్కేషన్ (సరిహద్దులు గుర్తింపు) అప్పగింత ప్రక్రియను కూడా సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించినట్లు తెలిపారు. భూ సమస్యలను పరిష్కరించి, మంగళగిరి – గుంటూరు ప్రాంతంలో మెరుగైన రహదారి మౌలిక వసతులు, వేగవంతమైన కనెక్టివిటీ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.








కామెంట్‌లు (0)