శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగిరిజనులకు నాణ్యమైన వైద్యం

1 గంట క్రితం

1788002269691-1788017527689-9471.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 12:34 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • జిఒ నంబర్ 3కి త్వరలోనే ప్రత్యామ్నాయం

  • సంజీవని కార్యక్రమంలో సిఎం చంద్రబాబు

  • అరకులోయ గన్నెలలో ఆరోగ్య రథాలు ప్రారంభం

ప్రజాశక్తి - అరకులోయ (అల్లూరి జిల్లా) : గిరిజన ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికీ నాణ్యమైన వైద్యం, సాంకేతిక ఆధారిత మెరుగైన వైద్య సేవలు తమ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలన్నీ ఆదివాసీలకే దక్కేలా జిఒ నంబర్ 3 తామే తీసుకువచ్చామని, గత పాలకుల నిర్లక్ష్యంతో దానిని సుప్రీంకోర్టు రద్దు చేసిందని, ఈ అంశంపై అందరికీ ఆమోద యోగ్యమైన ప్రత్యామ్నాయాన్ని త్వరలోనే తీసుకువస్తామని అన్నారు. అల్లూరి జిల్లాలోని అరకులోయ మండలం గన్నెలలో శనివారం ‘సంజీవని పథకం’ ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా పలు 'ఆరోగ్య రథాల'కు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి సిఎం మాట్లాడారు. గతంలోనే ఆయుర్వేద వైద్యాన్ని గిరిజనులకు అల్లూరి సీతారామరాజు అందించారని, అలాంటి మహనీయుడిని నిత్యం స్మరించుకునేందుకు కొత్తగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు అల్లూరి పేరు పెట్టామన్నారు. థింసా నృత్యాలతో గిరిజన బిడ్డలు గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ దిశగా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కనెక్టివిటీ పెంచేందుకు కూడా మారుమూల ప్రాంతాల్లో సెల్ టవర్స్‌ను ఏర్పాటు చేస్తున్నా మని, యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలను ప్రోత్సహించి ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కొండ ప్రాంతాల్లోని వారికి వైద్య సేవల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండకూడదన్నదే తన సంకల్పమన్నారు. దీని కోసమే సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమం రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఓ గేమ్ ఛేంజర్‌గా మారుతుందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి రోగుల రక్త నమూనాలను పెద్ద ఆసుపత్రికి డ్రోన్ల ద్వారా తరలించి, పరీక్ష చేసి చికిత్స అందించేలా చర్యలు చేపట్టామని, తల్లీబిడ్డా ఎక్స్‌‌ప్రెస్‌ ‌ద్వారా గర్భిణులకు సేవలందించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో ఏ కుటుంబమూ పేదరికంలో ఉండకూడదన్నదే తమ ఆలోచనని తెలిపారు. అడవితల్లి బాట పేరుతో రూ.వెయ్యి కోట్లతో 900 కిలోమీటర్ల రహదారులు వేశామని, 1.60 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా నీరు, సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి పెరిగేలా అరకు కాఫీని మరో లక్ష ఎకరాల్లో సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. అరకు ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెరిగిందని, హోమ్ స్టేల ద్వారా ఆతిథ్యం ఇస్తే గిరిజన కుటుంబాలకు ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ ప్రాంతానికి వచ్చే పరిశ్రమల్లో గిరిజన యువత ఉద్యోగాలు సాధించేలా నైపుణ్యాభివృద్ధి కల్పిస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ కల్పించాలన్నదే తమ ఆలోచన అని పేర్కొన్నారు. అత్యవసర వైద్య సేవలను అందించేందుకు జిల్లాలో 150 వాహనాలతో ఎమర్జెన్సీ లైఫ్‌లైన్ నెట్‌వర్క్ ఉందన్నారు. గిరిజన ప్రాంతాలకు మంచి వైద్య సేవలు అందేలా రూ.250 కోట్లతో ట్రైబల్ హెల్త్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీషన్ మిషన్ తీసుకువస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. అరకు పార్లమెంట్ పరిధిలోనే 435 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌‌లు, 28 ల్యాబ్‌లు, ఎనిమిది కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అల్లూరి జిల్లా కలెక్టర్ నిశాంతి. జిసిసి ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఎపిఎస్‌ ఆర్‌‌టిసి విజయనగరం జోన్ చైర్మన్ సియారి దొన్నుదొర, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి వీర పాండ్యన్, తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి అధికారులపై సిఎం అసంతృప్తి

​అల్లూరి జిల్లా అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమక్షంలోనే అధికారుల పనితీరును ఎండగట్టారు. వివిధ శాఖల అధికారులతోపాటు, జిల్లా కలెక్టర్ పనితీరు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు సేవకుల్లా పనిచేయాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఆర్‌‌కె నగర్‌‌లో మాటామంతీ

గన్నెల పంచాయతీలోని ఆర్‌‌కె నగర్‌‌ ప్రజలతో సిఎం ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలు, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామంలో 47 ఇళ్లు, 189 జనాభా ఉండగా పాపులేషన్ మేనేజ్‌‌మెంట్‌ ‌బాగుందని, దానికిగల కారణాలు ఏంటని ? సిఎం అడిగారు. ఓ మహిళ తన కుమార్తె నీట్ కోచింగ్‌ ‌తీసుకుంటోందని తెలుపగా ‘శభాష్‌’ అన్న సిఎం అందరూ అదే స్ఫూర్తితో పిల్లలను చదివించాలని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్