శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిపిఎం, ప్రజాసంఘాల నేతలపై ప్రభుత్వ నిర్బంధం

1 గంట క్రితం

1788019186619-1788019679926-5956.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 12:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో బైండోవర్‌ కేసులు

ప్రజాశక్తి- మార్కాపురం : వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్బంధ చర్యలకు దిగింది. నిర్వాసితులకు అండగా ఉంటున్న సిపిఎం, ప్రజాసంఘాల నేతలను పోలీసులు బైండోవర్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య, పట్టణ కార్యదర్శి డికెఎం.రఫీ, ఎపి రైతు సంఘం సీనియర్ నాయకులు గాలి వెంకటరామిరెడ్డి, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విజయ్, మండల నాయకులు వందన్ కుమార్, నిర్వాసిత పోరాట కమిటీ నాయకులు కె.దేవ సహాయం, కుందూరు అంజిరెడ్డి, దర్శనం యేసు రాజు, శశింద్ర, రంగ సాయిలు, ఎం అనిల్ పై బైండవర్ కేసులు నమోదు చేశారు. వారిని పోలీస్‌ ‌స్టేషన్‌ ‌కు పిలిపించి సంతకాలు చేయించుకొన్నారు. అనంతరం వారిని విడిచిపెట్టారు. బైండోవర్‌ సమయంలో సిఐ ఎండికె.అల్తాఫ్ హుస్సేన్ తో సోమయ్య మాట్లాడుతూ తాము వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే, నిర్వాసితులకు రావాల్సిన పరిహారం రాకపోవడంతో వారికి అండగా ఉంటున్నామని తెలిపారు. కాగా, మార్కాపురం, పెద్దారవీడు మండలాల వైసిపి గ్రామ స్థాయి నాయకులను గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. వైసిపి నాయకులకు ఇప్పటికే వారి నుండి ఫోన్లు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు ఈ విధమైన చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

నిర్బంధం తగదు : రమాదేవి

నిర్వాసితులకు సిపిఎం నేతలు, ప్రజాసంఘాల నాయకులు అండగా నిలిచారనే అక్కసుతో పోలీసులు నిర్బంధం కొనసాగించడం సరికాదని, ఈ చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసుల చర్యలను ఆమె ఖండించారు.

సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన

వెలిగొండ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం వస్తున్న నేపధ్యంలో నిర్వాసితులకు అండగా నిలిచిన సిపిఎం జిల్లా నాయకులను బైండోవర్‌ పేరుతో పోలీస్‌ ‌యంత్రాంగం స్టేషన్‌‌కు తరలించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. తక్షణం వారిని విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిర్వాసితుల్లో నిర్లక్ష్యానికి గురైన 18 సంవత్సరాలు దాటిన యువతకు, ఇతరులకు సిపిఎం అండగా నిలిచిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సోమవారం జరిగే కార్యక్రమం ప్రశాంతంగా జరిగేటట్లు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. 30 సంవత్సరాలుగా వెలిగొండ ప్రాజెక్టు కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నది కమ్యూనిస్టులేనని తెలిపారు. 1996లో సిపిఎం, సిపిఐ రాష్ట్ర నాయకుల ఒత్తిడి మేరకే వెలిగొండ ప్రాజెక్టు శంఖుస్థాపనకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు అంగీకరించి వచ్చారని తెలిపారు. ఆ సభలో సిపిఎం నాయకులు కొరటాల సత్యనారాయణ తదితరులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, కానీ ఆ తర్వాత ప్రాజెక్టు పని ఒక్క అడుగూ ముందుకు పోలేదని తెలిపారు. ప్రాజెక్టు పనుల పూర్తి కోసం ప్రజలను కూడగట్టి సిపిఎం, సిపిఐ తదితర వామపక్ష పార్టీలు, స్వచ్చంద సంస్థలు, మాజీ ఇంజనీర్లు అనేక పోరాటాలు చేశారని వివరించారు. పాదయాత్రలు నిర్వహించారని, పని ఆగిపోయినప్పుడల్లా రాష్ట్ర నాయకులు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ప్రాజెక్టు కోసం ఇంతగా పోరాడిన పార్టీని నిర్వాసితులకు న్యాయం చేయాలన్నందుకు నిర్బంధించడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. నీళ్లు వదలడానికి ముందే నిర్వాసితులకు పరిహారం, ప్యాకేజీ చెల్లించాలని, నిర్వాసితుల సంఘం, సిపిఎం ఆధ్వర్యంలో పలు పోరాటాలు జరిగిన తర్వాతే ప్రభుత్వం తప్పనిసరై నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ పోరాటాలకు ముందు బలవంతంగా ఖాళీ చేయించాలని అధికారులు చేసిన ప్రయత్నం విఫలమైందని, అమానుషంగా ఎక్కడికైనా పోయి గూడారాలు వేసుకొని బతకండని బాధ్యతారాహిత్యంగా సమాధానాలు ఇచ్చారని తెలిపారు. ఈ రోజు నిర్వాసితులకు ఎక్కువ భాగం పరిహారం అందిందంటే దానికి ఈ పోరాటాలే ప్రధాన కారణమని వివరించారు. ఇప్పటికీ 18 సంవత్సరాలు దాటిని యువతీ, యువకులకు 2019 ప్యాకేజీ ఇవ్వకుండా రూ.2 లక్షలతో చేతులు దులుపుకోవడం అన్యాయమని తెలిపారు. అయినా నిర్వాసితులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని, కానీ ప్రభుత్వం ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ఇప్పటికైనా నిర్బంధాన్ని ఆపి సోమవారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేటట్లు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని శ్రీనివాసరావు కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్