సెప్టెంబరులో ధర్నాలు, అక్టోబరులో సెమినార్
రౌండ్ టేబుల్ *సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో దళితుల సమస్యలపై వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్త ధర్నాలు, అక్టోబరులో సెమినార్‌ను నిర్వహించనున్నట్లు వక్తలు తెలిపారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో కెవిపిఎస్, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యాన ‘కులవివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం’ అంశంపై శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి లోకనాథం అధ్యక్షత వహించారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి వక్తలను పరిచయం చేయగా, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా విద్యారంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ రమేష్ పట్నాయక్ మాట్లాడుతూ.. విద్య ద్వారా మాత్రమే కులవివక్ష పోతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి తరగతులకు చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా దళిత విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించొచ్చన్నారు. ఎస్‌సి సబ్ స్లాన్ నిధులను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల భోజన ఖర్చుల కింద పాలకులు చూపిస్తున్నారని విమర్శించారు. విద్య అంతా కాషాయీకరణ జరుగుతోందని, దీన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ ఐఎఎస్ బి శ్రీనువాస్ మాట్లాడుతూ.. ఎస్‌సిల భూములను బలవంతంగా లాక్కొంటున్నారని విమర్శించారు. కార్పొరేట్లకు రూ.99 పైసలకే ఎకరం భూమిచ్చే ప్రభుత్వం.. దళితులకు జిఓ ప్రకారం భూములను ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ఎస్‌సిలను విభజించి పాలకులు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. కులవివక్ష ఎందుకు జరుగుతుందో మేథోమధనం జరగాలన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ.. అంటరానితనం, భూముల ఆక్రమణలు, శ్మశాన వాటికల సమస్యలు, విద్య, ఉపాధి, గృహ వసతి, మౌలిక వసతుల కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు, 381 మండలాలు, 1,256 గ్రామాలు, 72 పట్టణాలు, 246 వార్డుల్లో నిర్వహించిన అధ్యయన యాత్రలో దళితుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు తెలిపారు. 960 గ్రామాల్లో శ్మశాన వాటికలు, 405 గ్రామాల్లో ఇళ్ల స్థలాలు, 502 గ్రామాల్లో భూ సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎనిమిది దశాబ్దాల స్వాతంత్య్రం తర్వాత కులవివక్ష, అంటరానితనం, సామాజిక బహిష్కరణ, దాడులు, భూముల ఆక్రమణలు కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. కొత్తపల్లి పున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేసి మిగులు భూములను భూమిలేని దళితులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేసి దళిత యువతకు ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. వెలిగొండ నిర్వాసితులకు ప్లాట్ల కేటాయింపుల్లో వివక్ష లేకుండా చూడాలని, దళితవాడలకు గుర్తింపు, అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటులో ఎదురవుతున్న వివక్షను తొలగించాలని కోరారు. అధ్యయన యాత్రలో గుర్తించిన సమస్యలపై జిల్లా స్థాయిలో శాఖల వారీ సమీక్ష నిర్వహించి పరిష్కారానికి ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. గతంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రికి ఇచ్చిన అర్జీలపై సమీక్షకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఎపి పటేల్, మేకల భాగ్యారావు, గద్దల ఆదాం, డి రమాదేవి, కె సుబ్బరావమ్మ, ఎం హరిబాబు, ఎస్ అనిల్ కుమార్, వి సావిత్రి, దడాల సుబ్బారావు, అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)