- ఎటిసి టవర్ - కమ్ - టెక్నికల్ బ్లాక్ ప్రారంభించిన మంత్రి రామ్మోహన్ నాయుడు
ప్రజాశక్తి-గన్నవరం: విమాన రాకపోకల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన అత్యాధునిక ‘ఎటిసి (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) టవర్-కమ్-టెక్నికల్ బ్లాక్’ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శనివారం ప్రారంభించారు. ఆయన వెంట ఎంపిలు కేశినేని చిన్ని, వల్లభనేని బాలశౌరి ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ... ఈ కొత్త సాంకేతిక కేంద్రంలో ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (ఎటిఎస్), కమ్యూనికేషన్, నావిగేషన్, సర్వైలెన్స్ (సిఎన్‌ఎస్) వంటి అధునాతన వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం నూతన టెర్మినల్ భవన నిర్మాణ పనులపై సమీక్షించారు. కేశినేని చిన్ని మాట్లాడుతూ... ఇదివరకు ఉన్న సర్వీసులతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కనెక్టివిటీని పెంచామని, ముంబైకి రోజుకు రెండు ఫ్లైట్లు నడుపుతున్నామని తెలిపారు. ఈ నెల 25 నుండి అంతర్జాతీయ సర్వీసులు పెరుగుతాయని, ఆగస్టు 13 నుండి వారణాసి, కోల్‌కతా సర్వీసులు కూడా ప్రారంభం కానున్నాయని వివరించారు. శబరిమల యాత్రికుల సౌకర్యార్థం కొచ్చిన్ ఫ్లైట్ ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. దసరా పండుగ నాటికి నూతన టెర్మినల్ భవనాన్ని పూర్తి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరినట్లు ఎంపి చిన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవికె ప్రాజెక్ట్స్ ప్రతినిధులు, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్, విమానాశ్రయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)