సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దోపిడీ కోసమే మద్య పాలసీ మార్పు

1 గంట క్రితం

kolusu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 09:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- మంత్రి పార్ధసారధి

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి వీలుగా వైసిపి ప్రభుత్వం మద్యం పాలసీని రూపొందించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి 'మద్యపాన నిషేధం' చేస్తామని ఊరూరా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక దోచుకున్నారని పేర్కొన్నారు. టిడిపి కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం దేశంలోనే జరిగిన అతిపెద్ద స్కామ్‌లలో ఒకటని అన్నారు. రూ. 3,500 కోట్ల మద్యం కుంభకోణం బయటపడినా వైసిపి నాయకుల్లో పశ్చాత్తాపం లేదని మండిపడ్డారు. తమ హయాంలో జరిగిన దోపిడీపై ఎవరూ మాట్లాడకూడదని, విచారణ జరిగితే ప్రభుత్వం తమపై కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ కులాలు, మతాలు, రాజకీయాలను అడ్డం పెట్టుకుని ఎదురుదాడి చేయడం వారికి సిద్ధాంతంగా మారిందని పేర్కొన్నారు. అనుకూలంగా ఉంటే సీబీఐ విచారణ కావాలని కోరడం, అదే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆధారాలతో సహా దోపిడీని బయటపెడితే రాజకీయ కక్ష అని గగ్గోలు పెట్టడం వైసిపి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబం మద్యం వ్యాపారంలో, రవాణా కాంట్రాక్టుల్లో ఉన్నట్లు స్వయంగా అంగీకరించారని తెలిపారు.

పాపాల ఫలితమే కారుమూరి అరెస్ట్: ఎమ్మెల్యే గళ్లా మాధవి

కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు కక్షసాధింపు కాదని, పాపాల ఫలితమని టిడిపి ఎమ్మెల్యే గళ్లా మాధవి మరో సమావేశంలో అన్నారు. గత ప్రభుత్వంలో కాసుల కోసం కల్తీ మద్యం తయారు చేసి 30 వేల మంది మహిళల తాళిబొట్లు తెంచారని ఆరోపించారు. చివరికి ఇంటిలోని మహిళలను కూడా మద్యం రవాణా అవినీతి కేసులోకి తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పుడు కులం, కక్ష అంటూ వైసిపి నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఈడీ చర్యలకు కులం, కక్ష రంగు పూయడం అర్థరహితమని పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో మద్యం విషయంలో వారు తీసుకున్న నిర్ణయాలపై ఎంత వ్యతిరేకత వ్యక్తమైందో తెలిసినా, వారి ఏకపక్ష ధోరణి మారడం లేద తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్