శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆన్‌‌లైన్‌‌లోనే అన్ని ఫైళ్లు

9 గంటల క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 11:09 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు వెంటనే పరిష్కృతం చేయాలి

- కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

- సమావేశానికి గైర్హాజరైన అధికారులపై ఆగ్రహం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వంలో పాలన వేగంగా సాగాలంటే పైళ్ల పరిష్కరించడంలో జాప్యం ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇకపై దస్త్రాలు అన్నీ ఆన్‌‌లైన్‌‌లో నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు త్వరితగతిన క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఫైళ్లను సకాలంలో పరిష్కరించకుండా జాప్యం చేస్తున్న అధికారులపై కలెక్టర్ల సదస్సు వేదికగా శుక్రవారం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు దస్త్రాలను త్వరితగతిన క్లియర్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దస్త్రాలను సకాలంలో పరిష్కరించకుండా జాప్యం చేస్తున్న అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలో పరిష్కరిస్తున్న అధికారులను ప్రశంసించిన ఆయన.. గంటల్లోనే పరిష్కరిస్తున్న వారిని ప్రత్యేకంగా అభినందించారు. నాలుగు రోజుల సమయం తీసుకుంటున్న మంత్రులు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ల సదస్సుకు కొందరు అధికారులు హాజరుకాకపోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

వెంకట్రావు అనే అధికారి 35 రోజులు, ఉర్దూ అకాడమీ మైనార్టీ కమిషన్‌ అధికారి నిజాముద్దీన్‌ 28 రోజులు, శుభన్‌ ‌భన్సాల్‌, తెలుగు గంగ జలవనరుల శాఖ అధికారి వరప్రసాద్‌‌లు 8 రోజులు, బాయిలర్స్‌ ‌డైరెక్టర్‌ ఉమామహేశ్వరరావు 6 రోజులు చొప్పున ఫైళ్లు పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఈ అధికారులు సమావేశానికి కూడా హాజరు కాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దైర్యం ఉంటే సమావేశానికి హాజరు కాలేదని మండిపడ్డారు. అధికారుల గైర్హాజరుపై వివరణ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను ఆదేశించారు. తాను సమావేశాలకు ఫోన్లు కూడా తీసుకురావొద్దని చెప్పానని, 12 గంటలు సమావేశంలో కూర్చోలేకపోతే ఎందుకని ప్రశ్నించారు. కొంతమంది 1,2 రెండు రోజుల్లో ఫైళ్లు పరిష్కరిస్తున్నారని అభినందించారు. అదేవిధంగా శాఖ కార్యదర్శులందరూ రెండు రోజుల్లోనే పూర్తిచేస్తున్నారని చెప్పారు.మార్కాపురం జిల్లా కలెక్టర్‌, అల్లూరి సీతరామరాజు కలెక్టర్లు ఫైళ్ల పరిష్కారంలో ఎక్కువ రోజులు తీసుకుంటున్నారని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఇక ఆన్‌లైన్ ద్వారానే ఫైళ్లను నిర్వహించాలని, ఇందుకు నెల రోజుల గడువు ఇస్తున్నామని తెలిపారు. మాన్యువల్ ఫైళ్లు నడిపితే ఇకపై తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. మాన్యువల్ ఫైళ్ల నిర్వహణపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు మంత్రులు కూడా దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు.

​మంత్రులు కూడా మెరుగవ్వాలి

ఫైళ్ల పరిష్కారంలో మంత్రులు కూడా తమ పనివిధానాన్ని మెరుగుపరుచుకోవాలని రవాణ శాఖమంత్రి రామ్‌‌ప్రసాద్‌ ‌రెడ్డి, ఎక్సైజ్‌ ‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, హోంమంత్రి వంగలపూడి అనిత, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు సూచించారు. కొంత మెరుగయ్యాయని, ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. సమస్యలు లేని సమాజం కోసం అందరూ పనిచేయాలని చెప్పారు.పిజిఆర్‌ఎస్‌ దరఖాస్తులను ప్రజలకు సంతృప్తి కలిగేలా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో అధికారులు నాలుగు సార్లు గ్రామాలకు వెళ్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఇకపై ఈ పర్యటనల వివరాలను కూడా ఇవ్వాలని, మున్సిపాలిటీల్లోనూ ఇదే ప్రక్రియ జరగాలని చెప్పారు.

​సచివాలయ సిబ్బంది రైషనలైజేషన్

ప్రతి పంచాయతీ పరిధిలోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది విధుల స్పష్టత కోసం జాబ్ ఛార్ట్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొంతమందిపై ఎక్కువ పని భారం ఉంటే, మరికొందరికి చాలా తక్కువ పని ఉంటోందన్నారు. పనిభారం పెంచకుండా వివిధ బాధ్యతలను అప్పగించేలా చూడాలని చెప్పారు. సచివాలయ సిబ్బందిని రైషనలైజేషన్‌ ‌చేయాలని ఆదేశించారు. గ్రామ కార్యాలయాలకు ఒక్కో ఈవీ సైకిల్ ఇవ్వాలని చెప్పారు. ఒక్కో ఉద్యోగికి ఒక్కో బాధ్యత మాత్రమే అప్పగించాలనే విధానం కష్టసాధ్యమైందన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్