- డబుల్ ఇంజన్ పాలక రాష్ర్టాల్లో వరుస ఘటనలు..
- మహారాష్ర్టలో నిరుద్యోగి ఆత్మహత్య
పూణే : డబుల్ ఇంజన్ సర్కార్ వైఫల్యంతో భవిష్యత్తు కానరాక నిరుద్యోగులు బలవన్మారణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతో అప్పులు చేసి, పార్ట్ టైం పనులు చేసి వేలకు వేలు కోచింగ్ సెంటర్లలో ఫీజులు చెల్లించి, పరీక్షలకు సిద్ధమైన తరుణంలో వరుస పేపర్ లీకుల ఉదంతాలు అభ్యర్థులను కలవర పరుస్తున్నాయి. బుధవారం మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపిఎస్‌సి) సహా పలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 25ఏళ్ళ ప్రథమేష్ దేశ్‌ముఖ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వ్యవస్థలో జవాబుదారితనం తీసుకురావాల్సిన అవసరాన్ని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఉద్యోగంపై ఆసలు సన్నగిల్లి..
ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమ కుటుంబాన్ని ఒడ్డున పడేయాలనే ఆశతో ఎంతోమంది విద్యార్ధులు అప్పులు చేసుకుని, ఆస్తులు తనఖా పెట్టుకుని మరీ పల్లెటూళ్ళ నుండి నగరాలకు వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కానీ పరీక్షల నిర్వహణలో అవతకవకలు, అనిశ్చితి, జాప్యం జరగడం వంటి అనేక కారణాలతో ఆర్థిక భారాలు పెరిగిపోతున్నాయి.
అయితే, ధారశివ్‌కు చెందిన దేశ్‌ముఖ్ గత రెండేళ్ళ నుండి పూనేలో వుంటూ ఈ పోటీ పరీక్షలకు సన్నద్ధమవు తున్నాడు. తనకు గల అప్పులు, ఆర్ధిక సమస్యల కారణంగానే తానీ చర్యకు పాల్పడుతున్నానని ఆ ఆత్మహత్య లేఖలో రాసినట్లు పోలీసులు తెలిపారు. ఆ లేఖలోని అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒత్తిడి తగ్గించే సంస్కరణలు చేయాలి : అభిజిత్ దీప్కే
కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేత అభిజిత్ దీప్కే దీనిపై స్పందిస్తూ, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్ధులకు ఒక రోజు పరీక్ష వాయిదా పడిందంటే అది ఒక రోజుతో ముగిసే ఖర్చు కాదని, అదనంగా నెలల తరబడి అద్దె కట్టుకోవాల్సి వుంటుందని, ఆహారంతో సహా అనేక ఖర్చులు పెరిగిపోతాయని పేర్కొన్నారు. ఇది ఆ కుటుంబంపై అదనపు భారానికి దారి తీస్తుందని, ఈ అనిశ్చితికి విలువైన కాలాన్ని వారు పణంగా పెడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఎంపిఎస్‌సిలో పూర్తి స్థాయి పారదర్శకత, జవాబుదారీతనం కావాలని విద్యార్థులు కోరుతున్నారని తెలిపారు. రుణభారాలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులకు తగిన రీతిలో ఆర్థిక సాయం అందించాలన్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులపై ఒత్తిడిని తగ్గించేలా సంస్కరణలు తీసుకురా వాల్సిన అవసరం ఉందని అభిజిత్ తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ఇంకా ఎంతమంది విద్యార్ధులు ఆత్మార్పణ చేసుకోవాలని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నమ్మకం పెట్టుకున్న పరీక్షా వ్యవస్థ కుప్పకూలిపోవడంతో విద్యార్ధులు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అలాగే, మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉదాసీనత కనబరుస్తోందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరత్‌చంద్ర పవార్) నేత రోహిత్ పవార్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. దేశ్‌ముఖ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. పరీక్షా పత్రాల లీక్‌లతో సహా అనేక అవకతవకలను పక్కనబెడుతున్నారన్న భావన విద్యార్ధుల్లో తీవ్ర ఆందోళనలకు దారి తీస్తోందన్నారు. దాంతో ఇన్నేళ్ళ నుండి వారు చేస్తున్న కృషి అంతా కేవలం పరీక్షలకు హాజరు కావడంతోనే ముగిసిపోతోందని తెలిపారు.








కామెంట్‌లు (0)